తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రా బిడ్డ చూసుకుందాం…రెడీ అంటూ కేసీఆర్ ను సవాల్ చేశారు రేవంత్. ఇక, పేడమూతి బోడిలింగం…అంటూ కేటీఆర్ పై కాస్త పరుష పదజాలాన్ని వాడారు రేవంత్.

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో కౌంటర్ లు ఇస్తున్నారు. రేవంత్ గల్లీ స్థాయి నాయకుడని మరోసారి నిరూపించుకున్నాడని, తాము కూడా రేవంత్ ను ర**, కొ** అంటూ తిట్టగలనమి..కానీ, తాము అలా చేయబోమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

మాకు రాదా ఆ భాష అని ఫైర్ అయ్యారు. రేవంత్ గొట్టంగాడు …కేసీఆర్ కాలిగోటికి సరిపోడు అని తాము అనొచ్చని, కానీ, అలా అనబోమని విమర్శించారు. తమకు అన్ని భాషలు వచ్చని, కానీ, తమకు విజ్నత ఉందని అన్నారు. ఇక, అహంకారంతో కళ్లు నెత్తికెక్కి రేవంత్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తమ టైం వస్తుందని, అప్పుడు చెబుతామని అన్నారు.

2/3 గెలుస్తా అని రేవంత్ అంటున్నారని, గతంలో కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని సవాల్ విసిరిన రేవంత్ అక్కడ ఓడిపోయినా రాజకీయాల్లో కొనసాగుతున్నాడని విమర్శించారు. రేవంత్ కు మాట తప్పడం, పార్టీ మారడం, కమీషన్లు కొట్టడం, చిల్లర మాటలు మాట్లాడడం ఆయనకు అలవాటని దుయ్యబట్టారు.

కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపోడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఆ భాష తగదని హితవు పలికారు. రేవంత్ తీరుతో తెలంగాణ ప్రజలు ఏడుస్తున్నారని అన్నారు. ఇక, అభివృద్ధిని పక్కన పెట్టి బూతులతో పోటీ పడుతున్న రేవంత్ రెడ్డిని చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని, ఆయన మాటలతో ముఖ్యమంత్రి కుర్చీకున్న పరువు పోతోందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.

ఇదంతా చూస్తున్న నెటిజన్లు మాత్రం తెలంగాణ రాజకీయం మళ్ళీ వేడెక్కుతుందని కామెంట్లు చెయ్యగా, కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పరిణామాలపై విభిన్నమైన అభిప్రాయాలు తెలుపుతున్నారు. సీనియర్ నాయకులు ఇలా పరస్పరం వివాదాస్పద వ్యాఖలు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకునేదెవరని వ్యాఖ్యానిస్తున్నారు.