పవన్ 5 సార్లు సీఎం కావాలన్నదే ఆవిడ కోరిక

ఇప్పటం….జనసేన నేతలు, కార్యకర్తలకు ఈ పేరు బాగా గుర్తుంటుంది. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో ఆ గ్రామంపై అప్పటి వైసీపీ ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపణలు వచ్చాయి.

రోడ్డు విస్తరణ పేరు చెప్పి జనసేన కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేసి మరీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిందని జనసేన నేతలు ఆరోపించారు. అయితే, 2024 ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని, గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పటం రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు అప్పట్లో పవన్ కళ్యాణ్ కోరారు.

ఈ క్రమంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నేడు ఇప్పటంలో పవన్ పర్యటించారు. నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ వెళ్లారు. ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

నాగేశ్వరామ్మకు 50 వేల రూపాయలు, ఆమె మనవడి చదువు కోసం లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా ఆమె మనవడి చదువు కోసం ప్రతినెలా తన జీతం నుంచి 5 వేల రూపాయలు ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే పవన్ తమ ఇంటికి రావడం పట్ల నాగేశ్వరమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఇంటికి పెద్దకొడుకులా వచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని సంతోషించారు. ‘‘నువ్వు 5 సార్లు ముఖ్యమంత్రివి కావాలి…అది నేను చూడాలి…ఒకవేళ నేను చూడలేకపోయినా…నువ్వు 5 సార్లు సీఎం కావాలి’’ అని పవన్ తో నాగేశ్వరమ్మ అన్నారు. ఆ వ్యాఖ్యలకు పవన్ నవ్వి ఊరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.