కూటమిలో భాగంగా జనసేన పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు వచ్చాయని పవన్ తెలిపారు. మరికొంతమందిని త్వరలో నామినేట్ చేస్తామన్నారు. మొదట నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన వారికి, పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చామని, ఎటువంటి సిఫార్సు లేకుండా పదవులు అప్పగించామన్నారు. “పదవి అనేది చిన్నదా? పెద్దదా? అని కాకుండా వచ్చిన పదవిని ప్రజలకు సేవ చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి లభించే గొప్ప అవకాశంగా భావించాలి.“ అని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
“ఈ రోజు మనకు 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఇంతమంది కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారంటే దానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే కారణం కాదు. మనందరి భావజాలం, పోరాటశక్తి, పోరాట పటిమ. కారణం. ఏ పార్టీకి అయినా సమున్నతమైన భావజాలం, సిద్దాంతం ఉండాలి. సరైన ఆలోచన విధానం ఉండాలి. జనసేన పార్టీ ఐడియాలజీ, సిద్దాంతాలు బలమైనవి. పదిమందికి ఉపయోగపడేవి. నేను బతికే భావజాలమే పార్టీకి అన్వయించాను.“ అని తెలిపారు.
కులాలతో కూర్చోలేను!
రెండు మూడు కులాలతో కూర్చొని పార్టీని నడపలేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అన్ని కులాలు కలిస్తేనే సమాజం ఏర్పడిందన్నారు. ఏనాడు కులం కోసం పార్టీని పెట్టలేదని తెలిపారు. తనను కులానికి పరిమితం చేసి మాట్లాడితే బాధగా ఉంటుందని చెప్పారు. “జనసేన పార్టీ మూల సూత్రాల్లో అంతర్లీనంగా చాలా పెద్ద భావజాలం ఉంది. భావితరాలకు ఉపయోగపడాలనే ఏడు సూత్రాలని ప్రతిపాదించాను.“ అని పవన్ కల్యాణ్ వాటిని వివరించారు. ప్రధానమంత్రి మోడీ సైతం జనసేనకు గౌరవం ఇస్తున్నారంటే అది ఆశయ బలమని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates