పదిహేనేళ్ల వ్యూహంపై కుండ బద్దలు కొట్టిన పవన్

పవన్ కళ్యాణ్ రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన జనసేన.. 2024 ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడ నెగ్గాలో తెలిసిన రాజకీయ నేత పవన్ కళ్యాణ్ అంటూ రాజకీయ విశ్లేషణలు జరిగాయి.

కూటమి నిలబడడానికి, బలపడడానికి ఆయన కీలకంగా వ్యవహరించారని కూడా అనుకున్నారు. ఆ తర్వాత పవన్ చాలా సందర్భాల్లో కూటమి ప్రభుత్వం మరో 10 -15 ఏళ్లు ఉండాలని తన ఆకాంక్షను వెల్లడిస్తున్నారు. పవన్ అలా 15 ఏళ్ళు కూటమి అంటూ ఉంటే, చాలామంది జనసేన నేతలు, కార్యకర్తలు పవన్ ను సీఎంగా చూడలేమా అంటూ ఆందోళన చెందారు. వైసీపీకి చెందిన వారు ఆయన వ్యాఖ్యలకు విపరీత అర్ధాలు తీస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ పవన్ వ్యూహం వేరుగా ఉంది. 

అయితే జనసేన ‘పదవి–బాధ్యత’ కార్యక్రమంలో ఆయన ఈ అంశాలను కూలంకషంగా వివరించారు. కూటమి ప్రభుత్వంపై తన దృక్పథాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఒకరిని తగ్గించాలనో, మరొకరిని పెంచాలనో తాను కూటమి ప్రభుత్వం మరో 10–15 ఏళ్లు కొనసాగాలనే మాట అనడం లేదని చెప్పారు.

అయితే ప్రజాస్వామ్య వ్యవస్థను ముందుగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అది ఒక స్థాయికి వచ్చిన తర్వాత భవిష్యత్ ఆలోచనలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పరిస్థితుల్లో మనమంతా పరస్పరం పోరాడితే చివరికి అరాచకమే రాజ్యమేలుతుందని ఆయన హెచ్చరించారు. 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లకు తక్కువ కాకుండా కొనసాగాలి. ఎన్డీయే తప్ప మరేదీ అధికారంలోకి రాదనే నమ్మకం ప్రజల్లో కల్పించాలి. ఇబ్బందులున్నా వాటిని తట్టుకుని మరింత బలంగా నిలబడాలి అని గతంలో స్వయంగా ప్రధాని మోదీ పాల్గొన్న సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. జనసైనికులు దీనిని పాజిటివ్ గా తీసుకుంటే ఆయన అనుకున్న గోల్ ను రీచ్ అవుతారు. ముఖ్యంగా జనసేన పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది.