ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ కెరీర్ ఆరంభంలో ఎప్పుడో పెప్సి బ్రాండును కొంత కాలం ప్ర‌మోట్ చేసిన ప‌వ‌న్.. ఆ త‌ర్వాత ఎప్పుడూ యాడ్స్ జోలిక వెళ్ల‌లేదు.

త‌మ కాంబినేష‌న్లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాక ప‌వ‌న్‌కు అసాధార‌ణ‌మైన క్రేజ్ వ‌చ్చి.. ఆయ‌న‌తో బ్రాండ్స్ ప్ర‌మోట్ చేయించుకోవ‌డానికి కంపెనీలు పోటీ ప‌డ్డ‌ట్లు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ వెల్ల‌డించాడు. 

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ పాట లాంచ్ సంద‌ర్భంగా జ‌రిగిన ఈవెంట్లో ఈ విష‌యం చెప్పాడు. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డానికి నిర్మాత‌లు పోటీ ప‌డ్డ‌ట్లే యాడ్స్ కోసం కార్పొరేట్ సంస్థ‌లు కూడా క్యూ క‌ట్టిన‌ట్లు హ‌రీష్ తెలిపాడు.

ప‌వ‌న్‌కు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో స‌మానంగా రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌డానికి కంపెనీలు ముందుకొచ్చాయ‌ని.. కానీ కొన్ని కొన్ని ఉత్ప‌త్తులు ఆరోగ్యానికి మంచివి కావ‌ని, కొన్ని చిన్న పిల్ల‌ల‌కు మంచివి కావ‌ని ఆయ‌న వ‌ద్దనుకున్నారని.. త‌న క‌ళ్ల ముందే ప‌వ‌న్ కోట్లు కోట్లు వ‌దులుకోవ‌డం చూశాన‌ని హ‌రీష్ వివ‌రించాడు. 

ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటలో ఏ లైన్ విన్నా క‌ళ్యాణ్ గుర్తుకు వ‌స్తార‌ని.. కేవ‌లం ఆయ‌న మీద అభిమానంతో చేసిన పాట ఇది కాద‌ని.. ఆయ‌న లైఫ్ స్టైల్, సినీ, రాజ‌కీయ ప్ర‌యాణంపై అవ‌గాహ‌న‌తో ఈ పాట‌ను తీర్చిదిద్దామ‌ని హ‌రీష్ తెలిపాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌క్సెస్ రాత్రికి రాత్రి రాలేద‌ని.. ఆయ‌న జ‌ర్నీని క‌ళ్ల‌కు క‌ట్టే పాట ఇదని.. ఈ పాట మీద తాను, దేవిశ్రీ ప్ర‌సాద్ చాలా రోజులు ప్ర‌యాణం చేశామ‌ని.. చంద్ర‌బోస్ మాత్రం 8 గంట‌ల్లో ఈ పాట పూర్తి చేశార‌ని హ‌రీష్ తెలిపాడు.

హీరో ప‌రిచ‌య పాట‌ల్లో ఏదైనా ఏ హీరోకైనా సెట్ అయిపోతుంద‌ని.. కానీ ఆరా ఆఫ్ ఉస్తాద్‌లో మాత్రం ప్ర‌తి ప‌దం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకునే చంద్ర‌బోస్ రాశార‌ని.. అవి ఆయ‌న‌కే సూట‌వుతాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు హ‌రీష్‌. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ వ‌చ్చే నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.