రాజమండ్రిలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ లో కల్తీ పాలు తాగి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారని, మరో 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు.
అంతకుముందు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమయ్యారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్య శాఖ అధికారులు తక్షణం రాజమండ్రి వెళ్లాలని ఆదేశించారు.
ఈ ఘటనపై కలెక్టర్ కీర్తి చేకూరి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ పాల కారణంగానే మరణాలు సంభవించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని చెప్పారు. పాల శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్ పంపించామని, 2 రోజుల్లో నివేదిక వస్తుందని అన్నారు. చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు.
బాధితులకు పాలు పోసిన వ్యాపారి గణేశ్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. 46 మంది రైతుల దగ్గర నుంచి పాలు సేకరించి 106 కుటుంబాలకు గణేశ్ పాలు పోశాడని, ఆ ఇళ్లలోని వారిపై నిఘా ఉంచామని తెలిపారు. వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆస్పత్రిలో చేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15 తర్వాత నుంచి వాంతులు, మూత్రవిసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలతో వారితో సహా 14 మంది ఆసుపత్రిలో చేరారు.
బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడినవారున్నారు. 5 నెలల శిశువు, మూడేళ్ల బాలుడు కూడా చికిత్స పొందుతున్నారు. బాధితులందరికీ గణేశ్ అనే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates