టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో సౌత్ ఆఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. లీగ్ దశలో తిరుగులేని ఫామ్ లో కనిపించిన మన బ్యాటర్లు, కీలకమైన ఈ మ్యాచ్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేయడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాకు భారత బౌలర్లు మొదట్లోనే గట్టి షాక్ ఇచ్చారు. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ధాటికి టాప్ 3 బ్యాటర్లు కేవలం 20 పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే ఆ దశలో డేవిడ్ మిల్లర్ (63), డెవాల్డ్ బ్రెవిస్ (45) అద్భుతమైన భాగస్వామ్యంతో సఫారీలను ఆదుకున్నారు. భారత బౌలర్లు మధ్య ఓవర్లలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. సఫారీ బౌలర్ల పక్కా ప్లానింగ్ ముందు మన స్టార్ బ్యాటర్లందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. శివం దూబే (42) ఒక్కడే కాస్త పోరాడినప్పటికీ, మిగిలిన వారందరూ దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్ 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయి, ఈ టోర్నీలో తన మొదటి ఓటమిని మూటగట్టుకుంది.
సూపర్ 8 పాయింట్ల పట్టికలో ఈ ఓటమి భారత్‌ను కష్టాల్లోకి నెట్టింది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఇకపై జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న తప్పు జరిగినా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉండటంతో వచ్చే మ్యాచ్‌లు భారత్‌కు డూ ఆర్ డైగా మారాయి. టీమిండియా తన తదుపరి పోరులో ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, ఆ తర్వాత మార్చి 1న వెస్ట్ ఇండీస్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లు కూడా ప్రస్తుత ఫామ్ లో చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మరి ఈ ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని, బ్యాటింగ్ లో లోపాలను సరిదిద్దుకుని భారత్ మళ్ళీ విజయాల బాట పడుతుందో లేదో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates