వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ నాయకుల నుంచే వస్తున్నాయి. తాజాగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వంపై జగన్ సమరం చేస్తున్నారు. ఈ మొత్తం క్రెడిట్‌ను తానే తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కమ్యూనిస్టులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ కీలక సమయంలో వైసీపీతో కలిసి పోరాడేందుకు తాము సిద్ధమని కూడా ప్రకటించారు.
కానీ.. జగన్ కమ్యూనిస్టులను దూరం పెట్టి.. తానే స్వయంగా ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. తద్వారా ప్రభుత్వం వెనక్కి తగ్గితే.. ఆ క్రెడిట్ మొత్తాన్నీ తన పార్టీని అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో కమ్యూనిస్టులు సహా.. ఇతర చిన్న చితకా పార్టీలతో జగన్ దోస్తీ చేయడం బెటర్ అన్న సూచనలు పార్టీలోనే చర్చ సాగుతోంది. పోయిన ప్రాభవంతిరిగి దక్కించుకునేందుకు ఇతర పార్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని సూచిస్తున్నారు.
వైసీపీతో కలిసి నడిచేందుకు, ఉద్యమాలు సహా వచ్చే ఎన్నికల నాటికి కలిసి ముందుకు సాగేందుకు కూడా.. కమ్యూనిస్టులే కాకుండా.. జై భీం భారత్ పార్టీ, జైభారత్ సర్క్యులర్ పార్టీ, సహా పలు చిన్న పార్టీలు ఎదురు చూస్తున్నాయి. వీటిని కలుపుకొని ముందుకు సాగితే.. వైసీపీకి బలం చేకూరుతుందన్న చర్చ కూడా సాగుతోంది. కానీ, జగన్ మాత్రం ఆదిశగా ఆలోచన చేయడం లేదు.
దీనికి ప్రధానంగా.. తన ప్రభుత్వంపై ఆయా పార్టీలు విమర్శలు చేయడం.. తనను వ్యక్తిగతంగా దూషించడం వంటి కారణాలను ఆయన భూతద్దంలో చూస్తున్నారన్న వాదన ఉంది. కానీ… వాస్తవానికి రాజకీయాల్లో ఇలాంటివి కామనే. ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా.. రాజకీయాల్లో అందరూ అవకాశం చూసుకుని కలుస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. కానీ, తను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లే అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్న తీరుతో ఇప్పుడు ఇబ్బందులువస్తున్నాయి. మరి భవిష్యత్తులో అయినా మారుతారో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates