‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు కూడా.. కాంగ్రెస్ పార్టీదే విజ‌య‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈవ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క స‌వాల్ రువ్వారు. `ద‌మ్ము, ధైర్యం ఉంటే.. ఆ ప‌ది మందితో రాజీనామా చేయించు. ఎన్నిక‌ల‌కు వెళ్దాం“ అని బీఆర్ ఎస్ పార్టీ నుంచి వ‌చ్చి కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి.. సీఎం రేవంత్‌రెడ్డికి స‌వాల్ రువ్వారు.

“పంచాయ‌తీఎన్నిక‌ల్లో భారీ విజ‌యం ద‌క్కించుకున్నామ‌ని.. 66 శాతం మంది ప్ర‌జ‌లు కాంగ్రెస్‌తోనే ఉన్నార‌ని రేవంత్ రెడ్డి చెబుతున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు ద‌మ్ముంటే.. ఆ ప‌ది మందితో కూడా రాజీనామా చేయించాలి. అప్పుడు ఉప ఎన్నిక‌ల‌కు వెళ్దాం. ఎవ‌రు గెలుస్తారో.. ఎవ‌రు ఓడుతారో తెలుస్తుంది.“ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల‌లో ప‌ర్య‌టించిన కేటీఆర్‌.. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో స‌ర్పంచులుగా విజ‌యం ద‌క్కించుకున్న బీఆర్ ఎస్ మ‌ద్ద‌తు దారుల‌ను ఆయ‌న స‌న్మానించారు. పార్టీ సిద్ధాంతాల‌కు అనుగుణంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని సూచించారు.

స్పీకర్‌కు తెలియ‌దా?

అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ.. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ నుంచి పోయి.. కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నార‌ని.. ప్ర‌పంచం మొత్తం కోడై కూస్తుంటే.. స్పీక‌ర్ ప్ర‌సాద‌రావుకు తెలియ‌దా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యేలు అబ‌ద్ధాలు ఆడినా.. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌దవిలో ఉన్న స్పీక‌ర్ తెలుసుకోవాలి క‌దా?  అని ప్ర‌శ్నించారు. స్పీక‌ర్‌కు వినిపించ‌డం లేదా?  క‌నిపించ‌డం లేదా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “క‌డియం శ్రీహ‌రి.. స్ప‌ష్టంగా చెబుతున్న‌డు. నేను పార్టీ మారినా అన్న‌డు. అది కూడా స్పీక‌ర్‌కు విన‌ప‌డ‌లేదా?“ అని ప్ర‌శ్నించారు. పోచారం శ్రీనివాస‌రెడ్డికి కేసీఆర్ ఏం త‌క్కువ చేశార‌ని అన్నారు. మంత్రి ప‌ద‌వి ఇచ్చి గౌర‌విస్తే.. పార్టీని గాలికొదిలి పోయాడ‌ని, ఆయ‌న‌ది కూడా ఓ బ‌తుకేనా? అని నిల‌దీశారు.

ఆళ్లు రెండూ కానోళ్లా?

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. `ఆళ్లు రెండూ కానోళ్లా? ఆడా-మ‌గా?  తెలియ‌డం లేదు“ అని వ్యాఖ్యానించారు. “2 ల‌క్ష‌ల మంది ఓటేసి గెలిపిస్తే.. ఇప్పుడు మీ ప‌రిస్థితి ఏంటి?  ఎవ‌రికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారో.. ఏ పార్టీకి చెందిన వారో కూడా చెప్పుకోలేక పోతున్నారు. ప‌ద‌వుల కోసం.. గ‌బ్బిలాల మాదిరిగా వేలాడుతున్నారు“ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.