సోనియా, రాహుల్ గాంధీలపై కేసు… కోర్టు సంచలన వ్యాఖ్యలు

నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక వాటాల‌ను విక్ర‌యించ‌డం ద్వారా.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు అక్ర‌మాలకు తెర‌దీశార‌ని.. దీనిలో వారు.. మ‌నీలాండ‌రింగ్‌కు కూడా పాల్ప‌డ్డార‌ని.. పేర్కొంటూ.. సీబీఐ, ఈడీ అధికారులు కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. వీటికి సంబంధించి.. ఇద్ద‌రినీ సీబీఐ ఒక ద‌ఫా విచార‌ణ‌కు కూడా పిలిచింది. మ‌రోవైపు అరెస్టుల ప‌ర్వం కూడా కొన‌సాగుతుంద‌ని కొన్నాళ్ల కింద‌ట వార్త‌లు కూడా వ‌చ్చాయి.

అయితే.. తాజాగా ఈ కేసులో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇది కూడా ఓ కేసేనా? అంటూ.. ద‌ర్యాప్తు అధికారుల త‌ర‌ఫున హాజ‌రైన న్యాయ‌వాదిని నిల‌దీసింది. ఈ కేసులో మనీలాండరింగ్  వ్య‌వ‌హారాన్ని ప్ర‌శ్నించిన కోర్టు ఈడీ అధికారులు ఏదో ఉద్దేశంతో ప‌నిచేస్తున్నార‌ని అనిపిస్తున్న‌ట్టు వ్యాఖ్యానించ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. ఈ క్ర‌మంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

“ఈ కేసులో ఓ ప్రైవేటు వ్య‌క్తి(సుబ్ర‌మ‌ణ్య స్వామి) ప్ర‌మేయం ఉంద‌ని అంటున్నారు. కానీ, త‌గిన ఆధారాలు ఏవీ లేకుండా.. మీరు ఎలా ప‌నిచేస్తున్నారు? ఎవ‌రో వ‌చ్చి ఫిర్యాదు చేస్తే.. గుడ్డిగా విచార‌ణ పేరుతో కాలం వేస్టు చేస్తారా? ఎలాంటి ఆధారాలు లేకుండా ఎఫ్ ఐఆర్ ఎలా న‌మోదు చేస్తారు. “ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు ఉద్దేశ పూర్వ‌క‌మే అయితే.. ఫిర్యాదు చేసిన వ్య‌క్తి, అధికారులు కూడా కోర్టు ఆదేశాల మేర‌కు న‌డుచుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

నిజానికి మ‌నీలాండ‌రింగ్ కేసులు విచారించేప్పుడు.. త‌గిన ఆధారాలు ఉండాల‌ని వ్యాఖ్యానించిన కోర్టు.. ఈ కేసులో అలాంటి ఆధారాలు ఎక్క‌డున్నాయో.. త‌మ‌కు క‌నిపించ‌డం లేద‌ని చెప్పింది. అయితే.. ఈ కేసును బ‌ల‌ప‌రిచేలా మ‌రిన్ని సాక్ష్యాలు, ఆధారాలు స‌మ‌ర్పిస్తామ‌న్న ఈడీ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభ‌వించింది. ఈ ప‌ని ఇప్ప‌టికే చేసి ఉండాల్సింద‌ని.. పేర్కొంటూ.. మ‌రింత స‌మ‌యం ఇచ్చింది.