‘కూట‌మి’లో ప్ర‌క్షాళన‌.. త్వ‌ర‌లో మార్పులు?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలోనే కాదు.. పార్టీల్లోనూ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. పార్టీల ప‌రంగా పైస్థాయిలో నాయ‌కులు ఏకంగా ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయి. జిల్లాకొక రీతిగా నాయ‌కులు వ్య‌వహ‌రిస్తున్నారు. ఇలానే ఉంటే.. కూట‌మి అంతిమ ల‌క్ష్యం 15 ఏళ్ల అధికారం.. సాకారం కావ‌డం క‌ష్ట‌మ‌ని మూడు పార్టీలు.. టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌లు భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే జిల్లా స్థాయిలో నాయ‌కుల‌ను మార్చాల‌న్న‌ది ప్ర‌ధాన ప్ర‌తిపాద‌న‌. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని నాయ‌కులు, పార్టీలుచెబుతున్నా.. కొంద‌రు మాత్ర‌మే ప‌నిచేస్తున్నారు. ఈ స‌మ‌స్య ఒక్క టీడీపీలోనే కాదు.. జ‌న‌సేన‌, బీజేపీల్లోనూ క‌నిపిస్తోంది. క‌లివిడిగా ఉండాల‌ని అధిష్టానాలు చెబుతున్నా.. పార్టీల నాయ‌కులు విడివిడి రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అట‌ల్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల్లో మూడు పార్టీల మ‌ధ్య స‌మ‌న్వయం ఏర్పాటు చేసి.. నాయ‌కుల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని పార్టీలు చెప్పాయి.

కానీ, క్షేత్ర‌స్థాయిలో ఆ త‌ర‌హా ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో అధికారికంగానే నాయ‌కులు డుమ్మా కొడుతున్నారు. క‌ర్నూలు, అనంతపురం జిల్లాల్లో వ‌రుస‌గా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్లో మూడు పార్టీల‌కు చెందిన నాయ‌కులు పెద్ద‌గా పాల్గొన‌లేదు. ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే మ‌మ అనిపించారు. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ముఖ్యంగా మంత్రులు క‌లుస్తున్నా.. ఎమ్మెల్యేలు క‌ల‌వ‌డం లేదు. ఇక‌, జిల్లా స్థాయి నేత‌లు కూడా క‌డు దూరంగా ఉన్నారు.

ఈ ఒక్క‌టే కాదు.. రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీల ప‌రంగా కూడా చీలిక‌లు క‌నిపిస్తున్నాయి. దీనిని గ‌మ‌నించిన‌.. మూడు పార్టీలు ప్ర‌క్షాళ‌న చేయాల్సిందేన న్న నిర్ణ‌యానికి వ‌చ్చాయి. ఈ నెల ఆఖ‌రులో మూడు పార్టీల రాష్ట్ర స్థాయి నాయ‌కుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని .. కూట‌మి నాయ‌కులు చెబుతున్నారు. దీంతో ప్ర‌క్షాళ‌న దిశగా అడుగులు వేసి.. కూట‌మి ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉండే వారికి బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని భావిస్తున్నారు.