టికెట్ల రేట్లపై తేల్చి చెప్పిన మంత్రి

తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం, బెనిఫిట్ షోలు వేయడం గురించి ఏడాది కిందట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పాటు ఏ ఇబ్బందీ లేకుండా వీటికి అనుమతులు వచ్చేశాయి. కానీ ‘పుష్ప-2’ రిలీజ్ టైంలో చోటు చేసుకున్న విషాదం వల్ల.. చాలా రోజుల పాటు బెనిఫిట్ షోలు ఆగిపోయాయి. అదనపు రేట్లూ ఇవ్వలేదు.

కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలకు మాత్రం ఈ ఆఫర్ ఇచ్చింది ప్రభుత్వం. కానీ ‘ఓజీ’కి టికెట్ల రేట్ల పెంపుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు పడడం.. ఈ జీవోలు చెల్లవని కోర్టు ఆదేశాలివ్వడం ఇండస్ట్రీకి ఇబ్బందిగా మారింది. ఆ టైంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఇకపై రేట్ల పెంపు ఉండదని స్పష్టం చేశారు. కానీ తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’కు మళ్లీ రేట్లు పెంచారు. బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చారు.

కానీ దీని మీద మళ్లీ ఒక వ్యక్తి కోర్టుకెక్కారు. రేట్ల పెంపు చెల్లదని సింగిల్ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ఐతే వెంటనే నిర్మాతలు దీనిపై అప్పీల్ చేయడంతో కోర్టు దీనిపై స్టే ఇచ్చింది. ఈ నెల 14 వరకు రేట్ల పెంపు కొనసాగనుంది. 15న దీనిపై మళ్లీ విచారణ చేయనున్నారు. అప్పుడు రేట్ల పెంపును ఆపే అవకాశాలు లేకపోలేదు. ఐతే ప్రతిసారీ ఇలా కోర్టు కేసులు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఇకపై రేట్ల పెంపు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చేలా కనిపిస్తోంది.

సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మరోసారి ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ఇకపై ఏ సినిమాకూ టికెట్ల ధరలు పెంచమని ఆయన స్పష్టం చేశారు. ఈసారికి పొరపాటు జరిగిందని.. ఇకపై ఇలా ఉండదని ఆయనన్నారు. హీరోలకు వంద కోట్ల పారితోషకం ఎవరు ఇవ్వమన్నారని.. అందువల్లే బడ్జెట్లు పెరుగుతున్నాయని.. దీంతో టికెట్ల ధరలు పెంచి ప్రేక్షకుల మీద భారం మోపుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రేక్షకులకు టికెట్ల ధరలు అందుబాటులో ఉండాలన్నదే తమ ఉద్దేశమని.. అందుకే ఇకపై రేట్ల పెంపు ఉండదని ఆయన తేల్చి చెప్పారు.