కేసీఆర్‌ను బ‌య‌ట‌కు లాగి.. క‌విత గెలవగలరా?

సెంటిమెంటుకు-రాజ‌కీయాల‌కు మ‌ధ్య స‌యామీ క‌వ‌ల‌ల‌కు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాద‌ని నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌గ‌ల‌రా?  సాధ్యంకాదు. సో.. అలాంటి సెంటిమెంటు అస్త్ర‌మే కేసీఆర్‌. ఆయ‌న ఇప్పుడు యాక్టివ్‌గా లేక‌పోవ‌చ్చు. కానీ, కేసీఆర్ అంటే ఒక సెంటి మెంటు. ఒక భావొద్వేగం!. అలాంటి కేసీఆర్‌ను కాద‌ని బ‌య‌ట‌కు వ‌చ్చారు ఆయ‌న‌ కుమార్తె క‌విత‌. జ‌న జాగృతి పేరుతో యాత్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ అవ‌స‌రం లేద‌ని కూడా చెప్పారు.

ఈ క్ర‌మంలో నెమ్మ‌ది నెమ్మ‌దిగా.. త‌న తండ్రి ఫొటోల‌ను.. బీఆర్ఎస్ ప‌తాకాన్ని కూడా క‌విత ప‌క్క‌న పెడుతూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో త‌నంత‌ట తానుగా రాజ‌కీయాల్లో ఎదిగేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. ఎక్క‌డికి వెళ్లినా.. క‌వితను కేసీఆర్ కుమార్తెగానే చూస్తున్నారు!. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. రేపు ఆమెకు ఓట్లు రావాల‌న్నా.. తండ్రి ఇమేజ్‌తోనే ప‌డాలి.. అన్న వాద‌న కూడా ఉంది. సో.. మొత్తం గా క‌విత ఎంత కాద‌న్నా.. ఔన‌న్నా.. కేసీఆర్ సెంటిమెంటుపైనే ఆయ‌న ప‌డ‌వ సాగాలి.

కానీ.. ఇప్పుడు క‌విత అదే కేసీఆర్‌ను ప‌రోక్షంగా టార్గెట్ చేయ‌డంతోపాటు.. రెండు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. 1) 2014 నుంచి భారీ ఎత్తున దోచుకున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వ భూముల‌ను, ప్రై వేటు భూముల‌ను కూడా త‌మ‌కు అవ‌కాశంగా మార్చుకున్నార‌ని.. క‌బ్జాలు చేశార‌ని కూడా ఆమె వ్యాఖ్యానించారు. 2) తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో బెదిరించి డ‌బ్బు దోచుకున్నార‌ని బాంబు పేల్చారు. అయితే.. ఈ రెండు కూడా ప‌రోక్షంగా కేసీఆర్‌కు త‌గులుతున్న దెబ్బ‌లే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇలా కేసీఆర్‌ను టార్గెట్ చేసి.. క‌విత ఏమేర‌కు స‌క్సెస్ అవుతారు? అనేది ప్ర‌శ్న‌. రాజ‌కీయాల్లో టార్గెట్లు, కౌంటర్లు కామ‌నే అయినా.. సెంటిమెంటుతో బంధం అల్లుకున్న కేసీఆర్, వారి పాలనా కాలాన్ని టార్గెట్ చేసుకుంటే.. ఇత‌ర పార్టీల‌కేమో కానీ.. బీఆర్ఎస్‌లో పుట్టి, బీఆర్ఎస్‌లో పెరిగి, ఎదిగిన‌ క‌విత.. ఇప్పుడు తండ్రి పాల‌న పైనే విచార‌ణ చేయిస్తాన‌ని, ఉద్య‌మ స‌మ‌యంలో సొమ్ము దోచుకున్నార‌ని చెప్పి.. యాగీ చేయడం ద్వారా సాధించేది ఏమీ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.