వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఆయనను విచారించాలని ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దీంతో సిట్ అధికారులు ఆయనకు నోటీసులు కూడా పంపించారు. అయితే ఇటీవల ఆయన రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. కాపులు దళితులు కలిసి రాజ్యాధికారం దక్కించుకోవాలని అన్నారు.
కాపులకు సీఎం పదవిని ఆఫర్ చేశారు. దళితులకు ఉపముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని చెప్పారు. అయితే ఎవరూ అడగకపోయినా ఇలా వ్యాఖ్యలు ఎందుకు చేశారన్న అనుమానం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. దీనిపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగింది. అప్పటినుంచి ఇదే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. సునీల్ వెనుక ఉన్నది ఎవరు అనే విషయంపై టీడీపీ మరియు జనసేన నాయకులు దృష్టి పెట్టారు.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సునీల్ వెనుక వైసీపీ ఉందన్న వాదన వెలుగు చూస్తోంది. కాపుల ఓటు బ్యాంకును చీల్చడమే లక్ష్యంగా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. పవన్ చంద్రబాబు కలిసి ఉంటే కమ్మ కాపు కలిసి ఉంటే వైసీపీకి మేలు జరగదు. కాబట్టి వీరిని డైల్యూట్ చేయడం ద్వారా విడదీయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లాభం పొందాలని వైసీపీ చూస్తోందన్నది రాజకీయ విశ్లేషణ. రాజకీయంగా ఇది తప్పు కాదు. వైసీపీకి ఉన్న ప్రత్యామ్నాయ వ్యూహాలను కూడా ఎవరూ తప్పుపట్టరు.
కానీ ఒక అధికారిని అడ్డు పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయించడం చర్చకు కారణమైంది. ఎయిమ్ అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో పీవీ సునీల్ ఎస్సీ వర్గంలో సేవలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. నిజంగా ఆయనకు కాపులపై అంత ప్రేమ ఉందని అనుకుంటే ఈ మిషన్ ద్వారా ఎప్పుడైనా కాపు పేదలకు సాయం చేశారా అన్నదే ప్రశ్న. అంతేకాదు ఆయన ఎప్పుడూ కాపుల గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా వారికి సీఎం పదవి ఇవ్వాలని అనడం దళితులు ఏకం కావాలనడం వెనుక ఖచ్చితంగా వైసీపీ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates