పవన్ కు మళ్ళీ షాక్ తప్పేలా లేదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మళ్ళీ షాక్ తప్పదనే అనిపిస్తోంది. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేయబోయే అభ్యర్ధి బీజేపీ క్యాండిడేటే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల సందర్భంగా రెండుసార్లు కమలం నేతలు పవన్ కు షాకిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన కూడా పోటీ చేస్తుందని పవన్ చేసిన ప్రకటన తెలిసిందే. తర్వాత జనసేనానితో మాట్లాడిన కమలం నేతలు పోటీ నుండి జనసేన అభ్యర్ధులను విత్ డ్రా చేయించారు.

మరి చర్చల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ పవన్ కు ఏమి చెప్పారో ఎవరికీ తెలీదు. కానీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ తమ అభ్యర్ధులు పోటీ నుండి విత్ డ్రా అవుతున్నట్లు ప్రకటించారు. నిజానికి ఇది పవన్ కు మొదటిషాక్. ఇక రెండోదేమిటంటే గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నట్లు ప్రకటించిన పవన్ను అందుకు కూడా దూరంగానే ఉంచేశారు. అంటే గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రచారం వల్ల నష్టం జరుగుతుందన్న అంచనాతో పవన్ను ప్రచారానికి కూడా దూరంగానే ఉంచేశారట.

అంటే గ్రేటర్ ఎన్నికల్లో వెంట వెంటనే రెండు షాకులు తిన్న పవన్ కు ముచ్చటగా మూడో షాక్ కూడా తిరుపతి ఎన్నికల సందర్భంగా తప్పదనే అనుమానంగా ఉంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపుమీదున్న బీజేపీ అదే ఊపులో తిరుపతిలో కూడా పోటీకి రెడీ అయిపోతోందని సమాచారం. ఇందులో భాగంగానే మొన్నటి పవన్ తిరుపతి పర్యటనలోనే బీజం పడిందట. పవన్ తో బీజేపీ నేతలు కలిసి సుదీర్ఘంగా చర్చించారు.

తమ చర్చల్లో తిరుపతి లోక్ సభ పరిధిలోని అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో రెండుపార్టీల్లో ఏ పార్టీకి ఎన్నిఓట్లు వచ్చాయనే విషయంపై చర్చించినట్లు సమాచారం. లోక్ సభ పరిధిలో తమ పార్టీకి ఉన్న సభ్యత్వ వివరాలను కూడా కమలం నేతలు చెప్పారట. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో అసలు జనసేన అభ్యర్ధి పోటీనే చేయలేదు. బీఎస్పీ అభ్యర్ధి డాక్టర్ శ్రీహరిరావుకు జనసేన మద్దతిచ్చింది.

సో పాత విషయాలన్నింటినీ తవ్వి తీశారంటేనే పవన్ను మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి మళ్ళీ పవన్ను ఢిల్లీకి పిలిపించుకుని జేపీ నడ్డాతోనో లేకపోతో అమిత్ షా తోనే భేటి వేయిస్తే సరిపోతుంది. ఎంచక్కా బీజేపీ అభ్యర్ధి ఫైనల్ అయిపోయినట్లే. తిరుపతికి వచ్చి బీజేపీ అభ్యర్ధి గెలుపు కోసం కృషి చేయాలని పవన్ మళ్ళీ ఓ పిలుపిచ్చేయటం ఖాయమని కమలనాదులే సరదాగా చెప్పుకుంటున్నారు. అంటే మూడోసారి కూడా పవన్ కు కమలం షాకివ్వటం ఖాయమనే అనిపిస్తోంది.