బీజేపీ ద‌య‌వ‌ల్ల నా ఇమేజ్ నార్త్‌లోనూ పెరిగింది: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ద‌య‌వ‌ల్ల త‌న ఇమేజ్ నార్త్ వ‌ర‌కు పాకింద‌ని.. ఒక‌ప్పుడు తానెవ‌రో.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు తెలియ‌ద‌ని… కానీ.. బీజేపీ నాయ‌కు లు ఇప్పుడు చేస్తున్న అతి ప్ర‌చారం కార‌ణంగా.. త‌న పేరు ఇప్పుడు ఉత్త‌రాది రాష్ట్రాల్లోనూ వినిపిస్తున్న‌ట్టు తెలిపారు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన ముఖ్య‌మంత్రి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారికి ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న స‌ద‌స్సుకు రావాల‌ని ఆహ్వానం ప‌లికా రు.

అనంత‌రం.. మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో అనేక సంద‌ర్భాల్లో అంతర్గతంగా చ‌ర్చ‌లు జ‌రిపాన‌ని.. అయితే.. ఆ స‌మ‌యంలో మాట్లాడిన మాట‌ల‌ను బీజేపీ నాయ‌కులు ఎడిట్ చేసి.. ప్ర‌చారం చేస్తున్నార‌ని చెప్పారు. “ఇది వారి బుద్ధికి నిద‌ర్శ‌నం. దీనివ‌ల్ల నేనేంటో ఉత్త‌రాదికి కూడా తెలుస్తోంది.” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ స‌మాజం వంటిదేన‌ని తాను చెప్పాన‌ని అయితే.. దీనిని ఎడిట్ చేసి.. తానే త‌ప్పు మాట్లాడిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా ద‌క్క‌లేద‌ని.. ఆ అక్క‌సుతో త‌న‌పై ప్ర‌చారం చేస్తున్నార‌ని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. ఇక‌, ఈ నెల 8, 9 తేదీల్లోఫ్యూచ‌ర్ సిటీలో నిర్వ‌హించ‌నున్న తెలంగాణ రైజింగ్‌-2047 స‌ద‌స్సుకు వివిధ దేశాల నుంచి కూడా ప్ర‌తినిధులు వ‌స్తున్నార‌ని సీఎం తెలిపారు. దేశ‌వ్యాప్తంగా అంద‌రు సీఎంల‌కు ఆహ్వానాలు పంపుతున్నామ‌ని.. ఈ స‌ద‌స్సుకు రావాల‌ని ఆహ్వానిస్తున్నామ‌న్నారు. భ‌విష్య‌త్తు తెలంగాణను ఈ స‌ద‌స్సు వేదిక‌గా ఆవిష్క‌రించ‌నున్న‌ట్టు చెప్పారు.