అమెరికాలో ఉద్యోగం చేయాలనేది ప్రతి భారతీయ టెక్కీ కల. కానీ మారుతున్న నిబంధనలు, ట్రంప్ సర్కార్ ఆంక్షలతో ఆ కల చెదిరిపోతుందేమో అనే భయం అందరిలో ఉంది. సరిగ్గా ఈ సమయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు భారతీయ టెక్కీలకు పెద్ద ఊరటనిచ్చాయి. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మస్క్, H-1B వీసాల ఆవశ్యకత గురించి కుండబద్దలు కొట్టారు. ఈ ప్రోగ్రామ్‌ను రద్దు చేస్తే నష్టపోయేది భారతీయులు కాదు, అమెరికానే అని ఆయన తేల్చి చెప్పారు.
అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు లాక్కుంటున్నారనే వాదనను మస్క్ కొట్టిపారేశారు. అసలు అమెరికాలో టాలెంట్ ఉన్న వాళ్ల కొరత చాలా ఉందని, తమ కంపెనీల్లో క్లిష్టమైన పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదని ఆయన వాపోయారు. “మాకు తెలివైన వాళ్లు కావాలి, వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు” అని స్పష్టం చేశారు. H-1B వీసాలు రద్దు చేయాలనే ఆలోచన చాలా ప్రమాదకరమని, అది అమెరికా అభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటిదని హెచ్చరించారు.
అయితే, H-1B విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని మస్క్ ఒప్పుకున్నారు. కొన్ని అవుట్‌సోర్సింగ్ కంపెనీలు సిస్టమ్‌లోని లొసుగులను అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాయని అన్నారు. ఆ మోసాలను అరికట్టాలే తప్ప, మొత్తం వీసా విధానాన్ని రద్దు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. స్కిల్డ్ వర్కర్లు లేకపోతే చిప్స్, మిసైల్స్ వంటి కాంప్లెక్స్ టెక్నాలజీని అమెరికాలో డెవలప్ చేయడం కష్టమని ట్రంప్ కూడా రియలైజ్ అయ్యారని గుర్తు చేశారు.
బైడెన్ హయాంలో సరిహద్దు భద్రత గాలిలో దీపంలా మారిందని మస్క్ విమర్శించారు. అక్రమ వలసలను అడ్డుకోవడానికి బోర్డర్ కంట్రోల్స్ కచ్చితంగా ఉండాలని, లేకపోతే అది దేశమే కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధంగా H-1Bతో వచ్చే టాలెంటెడ్ వ్యక్తులకు, అక్రమంగా వచ్చే వారికి మధ్య తేడా ఉందని, టాలెంట్‌కు ఎప్పుడూ రెడ్ కార్పెట్ ఉండాలని ఆయన సూచించారు. గణాంకాలు చూస్తే.. గతేడాది జారీ అయిన H-1B వీసాల్లో 71 శాతం భారతీయులకే దక్కాయి. అంటే అమెరికా టెక్ రంగానికి భారతీయ మేధాశక్తే ఎక్కువగా అవసరం ఉంది. మస్క్ లాంటి గ్లోబల్ ఐకాన్ ఇలా మద్దతుగా నిలవడం టాలెంటెడ్ టెక్కీలకు కొండంత ధైర్యమని చెప్పవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates