శ్రీలంకను ‘దిత్వ’ తుఫాను అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో ఆ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 56 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వేలాది ఇళ్లు నీట మునిగాయి. దాదాపు 44 వేల మందిని స్కూళ్లు, షెల్టర్లకు తరలించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రాజధాని కొలంబోలో స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా పనిచేయలేదు. రైళ్లు నిలిచిపోయాయి.
కష్టకాలంలో ఉన్న పొరుగు దేశాన్ని ఆదుకోవడానికి భారత్ వెంటనే ముందుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో “ఆపరేషన్ సాగర్ బంధు” పేరుతో భారీ సహాయక చర్యలు చేపట్టింది. లంక ప్రజలకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టాల్లో ఉన్న మిత్రదేశానికి అండగా ఉంటామని, అవసరమైతే మరింత సాయం చేయడానికి సిద్ధమని సోషల్ మీడియా వేదికగా భరోసా ఇచ్చారు.
మాటలతో సరిపెట్టకుండా చేతల్లో సాయం మొదలుపెట్టింది ఢిల్లీ. కొలంబో తీరంలో ఉన్న మన యుద్ధనౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా అత్యవసర మందులు, ఆహారం, రిలీఫ్ మెటీరియల్‌ను అందించారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి మన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ విమానాల సేవలను వినియోగించాలని శ్రీలంక ప్రభుత్వం ప్రత్యేకంగా కోరడం గమనార్హం. మన నేవీ వెంటనే రంగంలోకి దిగింది.
భారత్ ఎప్పుడూ పాటించే “నేబర్‌హుడ్ ఫస్ట్” అనే విధానానికి ఇది నిదర్శనం. సముద్ర జలాల్లో మనకు అత్యంత సన్నిహిత దేశమైన శ్రీలంకకు ఆపద వస్తే చూస్తూ ఊరుకోలేమని భారత్ నిరూపించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఈ మిషన్ గురించి అప్డేట్ ఇస్తూ, అక్కడ చిక్కుకున్న బాధితులకు సాయం అందుతోందని స్పష్టం చేశారు.
లంకను దాటిన తర్వాత ఈ తుఫాను ప్రభావం మన దేశంపై కూడా పడే అవకాశం ఉంది. చెన్నైలోని వాతావరణ కేంద్రం ఇప్పటికే తమిళనాడులోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 12 గంటల్లో తుఫాను మరింత బలపడే అవకాశం ఉందని హెచ్చరించారు. అటు లంకలో సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఇటు మన తీర ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates