జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రెండుసార్లు గోల్డెన్ ఛాన్స్ మిస్సయిపోయినట్లే ఉంది. మొదటిసారి దుబ్బాక ఉపఎన్నిక, రెండోది తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికలు. ఎంతో ఉత్కంఠకు గురిచేసిన రెండు ఎన్నికలకు పవన్ దూరంగానే ఉండిపోయారు. మరి యాధృచ్చికమో ఏమో తెలీదు కానీ రెండింటిలోను బీజేపీ మంచి ఫలితాలనే రాబట్టింది. దాంతో కమలంపార్టీ విజయాల్లో తన వంతు పాత్రుందని చెప్పుకోవటానికి పవన్ కు వీల్లేకపోయింది.
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీకి ప్రచారం చేయాల్సిందిగా కమలంపార్టీ నేతలు రెండుసార్లు పవన్ను అడిగారట. అయితే హైదరాబాద్ లోనే పవన్ మాత్రం కనీసం అటువైపు తొంగికూడా చూడలేదు. సరే ఏదో కిందా మీదా పడి మొత్తానికి అధికారపార్టీ అభ్యర్ధిని బీజేపీ అభ్యర్ధి ఓడించారు. నిజానికి ఇక్కడ బీజేపీకి గెలిచేంత సీన్ లేదన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే కేసీయార్ ను వ్యతిరేకించే అనేక శక్తులు సైలెంటుగా బీజేపీకి సాయం చేయటం వల్ల గెలుపు సాధ్యమైంది. బీజేపీ గెలిచిన తర్వాత పవన్ శుభాకాంక్షలు, అభినందనలు చెబుతు ఓ మీడియా రిలీజ్ ఇచ్చి ఊరుకున్నారు.
తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. తర్వాత బీజీపీ ఎంపి, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి మంతనాలతో మెత్తబడి పోటినుండి విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదే సందర్భంలో పవన్ బీజేపీ అభ్యర్ధుల విజయానికి ప్రచారం చేస్తారంటూ కిషన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఎన్నికల ప్రచారంలో పవన్ ఎక్కడా కనబడలేదు. నవంబర్ 28,29 తేదీల్లో పవన్ ప్రచారం ఉంటుందని కూడా జనసైనికులు చెప్పారు. అయినా పవన్ ప్రచార ఊసే లేకుండా ఎన్నికలైపోయాయి.
మరి పవన్ గ్రేటర్ ప్రచారంలో బీజేపీ తరపున ఎందుకు ప్రచారం చేయలేదో ఎవరికీ తెలీదు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ 48 డివిజన్లలో గెలవటంతో అందరు బ్రహ్మాండమంటున్నారు. ఎన్నికల్లో అద్బుత విజయాన్ని అందించిన పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పవన్ అభినందిస్తు ఓ ప్రకటన విడుదలచేశారు. నిజానికి రెండు సందర్భాల్లోను పవన్ గనుక ప్రచారం చేసుంటే రెండు విజయాల్లోను తన షేరును క్లైం చేసుకునే అవకాశం ఉండేది. అలాంటి మంచి అవకాశాలను కాదనుకున్నందుకు పవన్ ఇపుడు చింతిస్తు కూర్చోవాల్సిందే. మొత్తానికి బీజేపీ పొత్తును మరింత బలోపేతం చేసుకునేందుకు వచ్చిన రెండు ఛాన్సులను పవన్ మిస్ చేసుకున్నారనే అనుకోవాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates