పవన్ వి పిచ్చిమాటలు అంటున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి

గోదావరి జిల్లాల పచ్చదనం వల్లనే రాష్ట్రం విడిపోయిందేమో అనిపిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవ్వుతూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నాయకుల దిష్టి తగిలి గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం కోనసీమలో తలలు లేని మొండెం మాదిరి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయని పవన్ అన్నారు. ఈ క్రమంలోనే పవన్ కామెంట్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలోనే పవన్ పై ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.

పవన్ కళ్యాణ్‌వి తెలివితక్కువ మాటలని, మైండ్ లెస్ అని జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దిష్టి వాళ్ళకి తాకలేదని, హైదరాబాద్ కే వారు వచ్చి పోతుంటారు కాబట్టి వారి దిష్టి తెలంగాణకు తగిలిందని అన్నారు. మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటూ పవన్ ను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ నుంచి కోనసీమకు ఎక్కువగా తెలంగాణ ప్రజలు వెళ్లరని..మాట్లాడేటప్పుడు నాలుకను అదుపులో పెట్టుకోకుండా, మెదడు వాడకుంటా ఈ తరహా వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. కావాలంటే కోనసీమ కొబ్బరి తోటలలో దిష్టిబొమ్మలు పెట్టుకోవాలని పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ వి పిచ్చి పిచ్చి మాటలని, తెలివితక్కువ మాటలని జగదీష్ రెడ్డి విమర్శించారు. మరి, జగదీష్ రెడ్డి కామెంట్లపై జనసేన నేతల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.