తనపై ఉన్న వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులకు సంబంధించి వైసీపీ అధినేత జగన్.. తాజాగా హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత.. ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. 2020లో ఒకే ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో కోర్టు ఆదేశాల మేరకు నాంపల్లికి వచ్చి.. కోర్టు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రినని… తాను బయటకు వస్తే.. భారీ భద్రత కల్పించాల్సి ఉంటుందని, పైగా తాను నిరంతరం ప్రజలతో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. విచారణకు హాజరు కాకుండా కోర్టునుంచి అనుమతి పొందారు.
దీంతో గత ఐదేళ్లు గా జగన్ విచారణకు రాకుండా.. తన న్యాయవాదులను మాత్రమే పంపుతున్నారు. అయితే, గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ఆయన కేవలం ఎమ్మెల్యేగా మిగిలారు. 11 స్థానాలే రావడం తో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దీంతో జగన్‌కు ఇప్పుడు ఎలాంటి హోదా లేదు. ఒక్క ఎమ్మెల్యేగా తప్ప.. కాబట్టి ఆయనను కోర్టుకు పిలవాలని సీబీఐ పిటిషన్ దాఖలుచేసింది. దీంతో కోర్టు ఇటీవల ఆయనను హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పడంతో జగన్ గురువారం కోర్టుకు వచ్చారు.
అయితే.. ఈ సందర్భంగా విమానాశ్రయం నుంచి కోర్టు వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులను పిలిచి.. ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా.. దండాలు పెట్టుకుంటూ.. జగన్ ముందుకు సాగారు. దీనిని వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. జగన్‌కు ప్రజాదరణ భారీగా ఉందని పేర్కొంటూ వార్తలు ప్రచారం చేసింది. అయితే.. ఈ వ్యవహారంపై టీడీపీ నాయకులు ఆసక్తిగా స్పందించారు. ఒకరకంగా సెటైర్లు సంధించారు. అయితే.. ఇక నుంచి జగన్ కోర్టు యాత్రలు, జైలు యాత్రలు చేసుకుంటే బెటర్ అని నాయకులు వ్యాఖ్యానించారు.
“ఎవరైనా కోర్టుకు వెళ్తుంటే.. అంతో ఇంతో భిడియ పడతారని.. కానీ, జగన్‌లో అలాంటిదేమీ లేదని.. పైగా ఇదేదో పెళ్లికి వెళ్లినట్టు వెళ్లారు“ అని కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. అంతే కాదు.. కోర్టుకు వెళ్లడం అలవాటు పడిన జగన్‌కు ఇది కొత్తకాదని కూడా ఎద్దేవా చేశారు. ఏదో ప్రజాక్షేత్రంలో కి ప్రజలను పరామర్శించేందుకు వెళ్లినట్టుగా ర్యాలీగా వెళ్లడాన్ని దుయ్యబట్టారు. జగన్ ఇక ముందు కూడా కోర్టు యాత్రలు విజయవంతంగా చేసుకోవాలని వ్యాఖ్యానించడం కొసమెరుపు.
Gulte Telugu Telugu Political and Movie News Updates