టీడీపీ మ‌హిళా నేత‌: ఎన్నిక‌ల్లో ఓడి.. జ‌నం మ‌న‌సు గెలిచి.. !

“ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఎన్నిక‌ల్లోనే గెల‌వాలా?. ఒక సంక‌ల్పంతో వ‌చ్చాం. అది నెర‌వేర్చుకునేందుకు ఎన్నిక‌లు ఒక అవ‌కాశం. ఎన్నిక‌ల్లో గెలిచి ఉంటే.. మ‌న సంక‌ల్పం మ‌రింత ప‌దును తేరుతుంది. అలాగ‌ని ఓడినా.. సంక‌ల్పాన్ని వ‌దిలేయాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌జ‌లకు ఏదో ఒక ర‌కంగా సేవ‌లు అందించేందుకు నా వంతు ప్ర‌య‌త్నం చేస్తా.”-ఇదీ.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి.. చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు గ‌ట్టి పోటీ ఇచ్చిన‌.. టీడీపీ నాయ‌కురాలు, తొలిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గొట్టిపాటి ల‌క్ష్మి వ్యాఖ్య‌.

గ‌త ఎన్నిక‌ల్లో అనేక మంది రాజ‌కీయాల్లోకి కొత్త‌గా అరంగేట్రం చేశారు. ఇలాంటి వారిలో గొట్టిపాటి ల‌క్ష్మి ఒక‌రు. వైద్య వృత్తిలో ఉన్న ఈమె.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ప్ర‌జ‌లకు సేవ చేసేందుకు రాజ‌కీయాల‌ను ఎంచుకున్నాన‌ని అప్ప‌ట్లోనే ఆమె చెప్పారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకునేందుకు ల‌క్ష్మి ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో భారీగానే పోరాడారు. కానీ, చివ‌రి నిముషం వ‌ర‌కు పోరాడినా.. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భంజ‌నం క‌నిపించినా.. ఇక్క‌డ ల‌క్ష్మి ఓడిపోయారు.

వాస్త‌వానికి ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత‌.. నాయ‌కులు త‌మ త‌మ‌ సొంత వ్య‌వ‌హారాలు చ‌క్క బెట్టుకుంటారు. ఇది స‌హజం కూడా. గ‌తంలో 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌లీల్ ఖాన్ కుమార్తె టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. కానీ.. ఓడిపోయారు. ఆ వెంట‌నే ఆమె అమెరికా వెళ్లిపోయారు. నిజానికి తాను ఓడినా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటాన‌న్నారు. కానీ, ఎన్నిక‌ల రిజ‌ల్ట్ వ‌చ్చిన మ‌రుక్ష‌ణ‌మే దేశం దాటేశారు. కానీ, దీనికి భిన్నంగా గొట్టిపాటి ల‌క్ష్మి ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటున్నారు.

ప్ర‌తి సోమ‌వారం.. పార్టీ కార్యాల‌యంలో ప్ర‌జావేదిక నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే ఫిర్యాదులు.. అభ్య‌ర్థ‌న‌ల‌ను తీసుకుంటున్నారు. వారికి ఓదార్పు క‌ల్పిస్తున్నారు. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయి ప‌ర్య ట‌న‌లు కూడా చేస్తున్నారు. మంత్రి గొట్టిపాటి ర‌వి దృష్టికి తీసుకువెళ్లి కొన్ని కొన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిం చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్ర‌తి శనివారం.. త‌న సొంత క్లినిక్‌లోనే పేద‌ల‌కు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అక్క‌డే మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఇలా.. ఓడిపోయినా.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటూ.. వారి హృద‌యం గెలుచుకుంటున్నారు.