వైసిపి అధికారం కోల్పోయి దాదాపు 20 మాసాలు అయింది. ఇది చాలా సుదీర్ఘ సమయం. ఒకటి రెండు మాసాలు అంటే ఆ బాధలోంచి బయటపడలేదు అనుకునే అవకాశం ఉంటుంది. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేశారు. నవరత్నాలు ఇచ్చారు. అయినా ఎందుకు ఓడిపోయాం అనే ఆవేదన నుంచి రెండు మూడు మాసాలు లేదా ఒక ఆరు నెలల వరకు ఆ ఆవేదనలో ఉన్నారంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు. కానీ, 20 మాసాల తర్వాత కూడా పార్టీ ఇంకా అదే ఆవేదనలో ఉందా లేకపోతే తాము చేసిందే కరెక్టు ప్రజలు ఇచ్చిన తీర్పు సరికాదు అనే భావనలో ఉందా అనేది చర్చకు వస్తుంది.
ఎందుకంటే ఇప్పటివరకు బలమైన ప్రతిపక్షంగా ప్రజా పోరాటాల విషయంలో వైసిపి వెనకబడే ఉంది. పార్టీ అధినేత జగన్ ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో ప్రజల మధ్యకు రాలేకపోయారు. ఇప్పటికీ ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం కానీ ప్రజల మధ్యకు వచ్చే ఆలోచన కానీ చేయక పోవడం గమనార్హం. ప్రతి నెల పార్టీ నాయకులతో సమావేశాలు అవుతున్నప్పటికీ నిర్ణీత ప్రణాళికను ఆయన అమలు చేయలేకపోతున్నారు. గత నెలలో పార్టీ సమావేశం పెట్టి త్వరలోనే తాను ప్రజల మధ్యకు వస్తానని చెప్పారు. కానీ అలా చేయలేదు.
అంతకు ముందు కూడా ఇలానే జరిగింది. మరోవైపు జిల్లా ఇన్చార్జిలను నియోజకవర్గాల ఇన్చార్జీలను ప్రజల మధ్యకు వెళ్ళమని చెబుతున్నారు. కానీ, ఇది అనుకున్నంత స్థాయిలో పార్టీకి మేలు చేయడం లేదు. కొంతమంది నాయకులు వస్తున్నారు, కొంతమంది నాయకులు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇంకొందరు మీడియా ముందుకు వచ్చి హడావిడి చేసి వెళ్ళిపోతున్నారు. ఈ పరిణామాలతో అసలు పార్టీలో ఏం జరుగుతోంది.. అనే విషయం జగన్ ఏ మేరకు తెలుసుకుంటున్నారు అనేదే అసలు ప్రశ్నగా మారింది. గెలుపు ఓటములు ఎలా ఉన్నప్పటికీ ప్రజలకు చేరువ కావడం అనేది అత్యంత ముఖ్యం.
ఈ విషయంలో జగన్ స్ట్రాటజీ లేకుండా అడుగులు వేస్తున్నారు అన్నది పార్టీ సీనియర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల్లోకి రావడం అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడమే కాదు. పార్టీపై సానుకూలత పెంచుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలని చెబుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు నిరంతరం ఉంటూనే ఉంటాయి. వాటిని అడ్రస్ చేయడం ద్వారా పార్టీ పుంజుకునేందుకు అవకాశాలుంటాయి. కేవలం ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల్లోకి రావడం సరికాదన్న వాదనా వినిపిస్తోంది.
నిరంతరం ప్రజల్లో ఉండటం ద్వారా వైసిపి సానుకూల ఓటు బ్యాంకు ముఖ్యంగా కార్యకర్తల్లో భరోసాను పెంచేందుకు అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. కనీసం నెలకి నాలుగు సార్లు అయినా ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఎక్కువమంది భావిస్తున్నారు. కానీ ఆ దిశగా ఇప్పటివరకు జగన్ ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. పైగా ఆయన చెబుతున్న ప్రణాళికలు కూడా అమలు కావడం లేదన్నది సీనియర్లు చెబుతున్న మాట. ఇలాగే ఉంటే పార్టీ మరోసారి ప్రతిపక్షంలోనే ఉన్నా ఆశ్చర్యం లేదని ఒకరిద్దరు నాయకులు అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానిస్తుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates