భారత రాజ్యాంగం ఎంతో గొప్పది… బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన ఈ అత్యున్నత రాజ్యాంగం వల్ల ఛాయ్ వాలా దేశానికి ప్రధాని కాగలిగారు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హాజయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు భారత దేశ దిశనే మార్చేశాయన్నారు. ఈ 75 ఏళ్ల మైలురాయి సందర్భంగా బీఆర్ అంబేడ్కర్ రూపకల్పనకు భారతీయులందరూ కృతజ్ఞులమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ పురోగతికి కారణం మన పటిష్టమైన రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థేనని ఆయన అభిప్రాయపడ్డారు.
2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు నాలుగో ఆర్థిక వ్యవస్థకు చేరామని తెలిపారు. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో మూడో, 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యం అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిన పెడుతోందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత సోషల్ మీడియా గురించి కూడా ఆయన మాట్లాడారు. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయన్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటరే.. ప్రతి ఒక్కరూ ఎడిటరే అని అన్నారు. సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరం అని చంద్రబాబు అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates