vహ్యాకింగ్ మోసాలకు అంతు లేకుండా పోయింది. ప్రభుత్వ వెబ్ సైట్లు, వ్యక్తుల సోషియల్ మీడియా ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారు. కీలక సమాచారాన్ని తస్కరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ సమాచారాన్ని డిలీట్ చేసిన ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషియల్ మీడియా ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు కీలక సమాచారాన్ని తస్కరించడం తో పాటు కొన్ని ఫైళ్లను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
తాజాగా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ ను కొందరు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించే సరికి కీలక తీర్పుల ఫైళ్లు ధ్వంసం అయినట్టు సమాచారం. శనివారం వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ఆన్ లైన్ బెట్టింగు సైట్లు దర్శనమిచ్చాయి. దీంతో ఉలిక్కిపడ్డ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు మరొకసారి వెబ్ సైట్ ఆన్ చేసి శుక్రవారం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించగా మళ్లీ బెట్టింగు సైట్ల తో పాటు ఇతర అసభ్యకర సైట్లు కూడా కనిపించాయి.
దీంతో సమాచారాన్ని అత్యంత రహస్యంగా సైబర్ పోలీసులకు చేరవేశారు. వారు రంగంలోకి దిగి సైట్ ను ఓపెన్ చేసి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఇతర దేశాలకు చెందిన ముఠాలు ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి చెందిన సైట్లను హ్యాక్ చేస్తున్నాయి. అదేవిధంగా కేంద్ర మంత్రుల సోషియల్ మీడియా ఖాతాలను కూడా స్తంభింప చేస్తున్నారు. ఈ పరిణామాలపై కేంద్రం మరియు రాష్ట్రాలు దృష్టి పెట్టినా సమస్య మాత్రం కొనసాగుతూనే ఉంది. నేరస్తులు కాంబోడియా వంటి దేశాల్లో ఉండడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates