జ‌గ‌న్ చేసింది రైటా రాంగా?

బుధ‌వారమంతా సోష‌ల్ మీడియాలో తెలుగువాళ్ల‌ పొటిలికల్ చ‌ర్చ‌ల‌న్నీ ఒక వీడియో మీదే న‌డిచాయి. అసెంబ్లీలో వైకాపా స‌ర్కారు చంద్ర‌బాబుకు సంబంధించి ప్ర‌ద‌ర్శించిన ఓ వీడియో తెగ వైర‌ల్ అయిపోయింది. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉన్న‌పుడు జ‌నాల్ని పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద‌కు బ‌స్సులు పెట్టి తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే.

అందులో ఓ బృందంలోని మ‌హిళ‌లు జ‌య‌ము జ‌య‌ము చంద్ర‌న్నా అంటూ పాట‌లు పాడిన వీడియోను స్వ‌యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డే అడిగి మ‌రీ ప్లే చేయించారు. దీన్ని చూపించి జ‌గ‌న్.. చంద్ర‌బాబును ఎగ‌తాళి చేయ‌డం, వైకాపా ఎమ్మెల్యేలు వెట‌కారంగా న‌వ్వ‌డం టీడీపీ వాళ్లు అస్స‌లు జీర్ణించుకోలేక‌పోయారు. వైసీపీ మ‌ద్ద‌తుదారుల‌తో పాటు టీడీపీ వ్య‌తిరేకులు ఈ ప‌రిణామాన్ని బాగా ఎంజాయ్ చేశారు సోష‌ల్ మీడియాలో.

ఐతే టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌తో పాటు కొంద‌రు త‌ట‌స్థులు జ‌గ‌న్ తీరును తప్పుబ‌ట్టారు. స‌భ‌లో ఇలాంటి వీడియో ప్లే చేయ‌డం ద్వారా ఎలాంటి సంస్కృతిని మొద‌లుపెడుతున్నార‌న్న ప్ర‌శ్న త‌లెత్తింది. ఈ ఒర‌వ‌డి ఇలాగే కొన‌సాగిస్తే దీనికి అంతెక్క‌డ అన్న‌ది వారి అభ్యంత‌రం‌. ఇప్ప‌టికే హ‌ద్దులు దాటిన మాట‌ల‌తో స‌భ హుందాత‌నం, దాని ప‌ట్ల‌ గౌర‌వం బాగా త‌గ్గిపోయింద‌న్న అభిప్రాయాల‌ నేప‌థ్యంలో ఇలాంటి ప‌రిణామాలు మ‌రింత ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతాయ‌న్న వాద‌న మొద‌లైంది.

చంద్ర‌బాబు వైపు వేలెత్తి చూపుతున్న జ‌గ‌న్ కూడా.. భ‌జ‌న చేయించుకోవ‌డంలో త‌‌క్కువేమీ కాద‌న్నదీ తెలిసిన సంగ‌తే. జ‌గ‌న్ సీఎం అయ్యాక స‌భ‌లో వైకాపా స‌భ్యులు, మంత్రులు పోటీప‌డి ఎలా పొగిడారో, పొగుడుతున్నారో.. బ‌య‌ట ఆ పార్టీ వాళ్లు హ‌ద్దులు దాటి జ‌గ‌న్ భ‌జ‌న ఎలా చేస్తున్నారో తెలిసిందే. ఈ వీడియోల‌న్నీ దాచి.. రేప్పొద్దున టీడీపీ అధికారంలోకి వ‌చ్చి వాళ్లు కూడా ఇలా స‌భ‌లో వీడియోలు ప్లే చేస్తే ప‌రిస్థితేంటి?