పేర్నిపై దాడి.. వ్య‌క్తిగ‌త దాడా? వ‌్య‌వ‌స్థాగ‌త దాడా?!

అధికార పార్టీ వైసీపీ నేత‌ల‌పై జ‌రుగుతున్న చెదురుమ‌దురు ఘ‌ట‌న‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నాల‌కు వేదిక అవుతున్నాయి. ఎంపీల‌పైనా.. ఎమ్మెల్యేల‌పైనా జ‌రుగుతున్న దాడుల‌ను కొంత వ‌ర‌కు అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే.. ఏకంగా మంత్రుల‌పై జ‌రుగుతున్న దాడులు, హ‌త్యాయ‌త్నాల‌ను ఎలా అర్ధం చేసుకోవాలి? ప‌్రభుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌తే.. ఈ దాడుల‌కు కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయా? లేక‌.. ఇంకేమైనా ఉన్నాయా? అనేవి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. తాజాగా మ‌చిలీప‌ట్నంలో మంత్రి పేర్నినాని ఇంటి వ‌ద్దే.. ఆయ‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఓ తాపీ మేస్త్రీ తాను వినియోగించే టాపీతోనే.. మంత్రిపై దాడి చేయ‌బోయారు.

అయితే.. ఈ దాడి నుంచి మంత్రి తృటిలో త‌ప్పించుకున్నారు. కాగా, గ‌తంలోనూ మంత్రి పేర్నిపై దాడి జ‌రిగింది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఆయ‌న‌పై చెప్పు విసిరారు. ఇక‌, గుంటూరు జిల్లా బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌పైనా దాడి జ‌రిగింది. ఆయ‌న‌పై ఒక దుండ‌గుడు చెప్పులు విసిరాడు. గ‌డిచిన ఆరు మాసాల కాలంలో ఇలా వైసీపీ నేత‌ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. నిజానికి ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌ను చూస్తే.. ఇలాంటి ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం ఇదే మ‌న‌కు కొత్త‌. గ‌తంలో ఎప్పుడూ ఇలా నేత‌ల‌పై దాడుల‌కు దిగిన సంద‌ర్భాలు మ‌న‌కు క‌నిపించ‌వు.

ఇత‌ర రాష్ట్రాల సంస్కృతి మ‌న‌కు ఇప్పుడు వ‌చ్చింద‌నే సందేహాలు వ‌స్తున్నా.. ఏకంగా మంత్రుల‌పైనే దాడుల‌కు దిగ‌డం అనేది అంత తేలిక‌గా తీసుకునే విష‌యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఏడాదిన్న‌ర‌లోనే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌చ్చిందా? అనేది ప్ర‌ధాన సందేహం. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై ప్ర‌జ‌ల్లో ఒక‌విధ‌మైన అసంతృప్తి నెల‌కొంద‌ని.. అన్ని వ‌ర్గాల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని అందుకే ఇలా దాడులు జ‌రుగుతున్నాయ‌ని అనేవారు ఉన్నారు. మ‌రోవైపు.. వ్య‌క్తిగ‌తంగా దాడులను కూడా కొట్టిపారేయ‌లేమ‌ని చెబుతున్నారు.

చంద్ర‌బాబు హ‌యాంలోనూ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ.. ఇంత‌గా భౌతిక దాడుల‌కు దిగిన సంద‌ర్భం ఒక్క‌టి కూడా లేదు. మ‌రి ఎందుకు ఇలా జ‌రుగుతోంది. ఏదైనా స‌మ‌స్య ఉంటే.. చెప్పుకొనేందుకు ప్ర‌భుత్వం స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తోంది. అయితే.. ఇక్క‌డ చెప్పుకొన్నా.. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డంలేద‌ని.. ప్ర‌జ‌లు భావిస్తున్నారా? అనే సందేహం కూడా వ‌స్తోంది. వ్య‌వ‌స్థ‌ల‌ను బాగు చేస్తామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం .. ఆ నెపంతో కొన్ని వ‌ర్గాల‌ను తొక్కేస్తున్న ఫ‌లిత‌మా? అనే సందేహం వ‌స్తోంది. జ‌రుగుతున్న దాడుల వెనుక కోణాన్ని నిశితంగా ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌.

తాపీ మేస్త్రీ తాజాగా పేర్నిపై హ‌త్యాయ‌త్నం చేసిన ఘ‌ట‌న‌నే తీసుకుంటే.. ఈ రంగంలో ఉపాధి త‌గ్గిపోయింది. ఇసుక కొర‌త‌తీవ్రంగా ఉంది. పైగా లారీ ఇసుక ప్రాంతానికో రేటు ప‌లుకుతోంది. దీంతో ప‌నులు మంద‌గించాయి. ప‌నులు లేకుండా పోయాయి. జ‌గ‌న్ అదికారంలో వ‌చ్చిన త‌ర్వాత‌.. బాగా దెబ్బ‌తిన్న రంగం నిర్మాణ రంగ‌మే. ఇక‌, క‌రోనాతో.. ఆరు మాసాలు పూర్తిగా ప‌నులు ఆగిపోయాయి. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. నిర్మాణ రంగం జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా న‌ష్ట‌పోయింది. దీంతో కార్మికులు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ క‌డుపు మంట‌తోనే తాపీ మేస్త్రీ దాడి చేసి ఉంటార‌ని అంటున్నారు. ఏదేమైనా.. ఈ దాడిని వ్య‌క్తి గ‌తంగా కంటే.. వ్య‌వ‌స్థాగ‌తంగా ప్ర‌భుత్వం చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌.