జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తో పాటు జనసైనికుల పరిస్ధితి గ్రేటర్ పరిధిలో విచిత్రంగా తయారైంది. పవన్ను టార్గెట్ చేస్తు బీజేపీ నేతలు తమిష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా పవన్ కానీ లేకపోతే ఇతర నేతలు కానీ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పేస్ధితిలో లేకపోవటమే విచిత్రంగా ఉంది. జనసేనతో పొత్తు విషయంపై ఎంపి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ అసలు బీజేపికి మద్దతు ఇవ్వమని జనసేనను ఎవరు అడిగారు ? అంటూ ఎదురు ప్రశ్నించటం సంచలనంగా మారింది.
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. తర్వాత ఓ 40 మందికి బీఫారాలు కూడా జారీచేశారు. అయితే తెరవెనుక ఏమైందో ఏమో వెంటనే బీజేపీ ఎంపి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ వెళ్ళి పవన్ తో భేటీ అయ్యారు. కేసీయార్ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండటం కోసం జనసేనను పోటీ నుండి విత్ డ్రా చేయించేట్లు ఒప్పించారు. అలాగే బీజేపీ గెలుపు కోసం పవన్ ప్రచారం చేస్తారని ప్రకటించారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఎందుకంటే భేటీ తర్వాత కిషన్+లక్ష్మణ్+పవన్ మీడియాతో నేరుగా మాట్లాడి ప్రకటనలు చేశారు.
సీన్ కట్ చేస్తే నామినేషన్లు అయిపోయిన తర్వాత నుండి కమలం నేతలు జనసేనను పూర్తిగా ఎన్నికలకు దూరం పెట్టేశారు. మాట్లాడాలనే నెపంతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పవన్ను ఢిల్లీకి పిలిపించుకున్నారు. మూడు రోజులు వెయిటింగ్ లోనే అట్టేపెట్టారు. తర్వాత పవన్ హైదరాబాద్ కు వచ్చిన ఎక్కడా ప్రచారం చేయలేదు. పవన్ మద్దతు ఎవరడిగారంటూ ఇపుడు అరవింద్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి. అసలు తెలంగాణాలో జనసేనకున్న బలమెంత ? అంటూ ఎదురు ప్రశ్నించారు.
అన్నింటికీ మించి బీజేపీ గురించి చెప్పుకుంటూ సింహం ఎపుడూ సింగిల్ గానే వస్తుందనే సినిమా డైలాగును కూడా వినిపించారు ఎంపి. అంటే అర్ధమేంటి అనే విషయంలో జనసైనికులు రగిలిపోతున్నారట. తమను ఎన్నికల్లో పోటీ చేయనీకుండా చేసి చిరవకు ప్రచారంలో కూడా రానీయకుండా కట్టడి చేసిన కమలం తీరుపై మండిపోతున్నారట. పైగా సింహం సింగిల్ గానే వస్తుందనే డైలాగుతో జనసేనలో బీజేపీపై బాగా మండిపోతున్నారట. కానీ చేసేదేముంది ? అన్న విషయమే ఎవరికీ అర్ధం కావటం లేదు. మొత్తానికి పవన్ను బీజేపీ బాగానే అవమానిస్తోందన్న విషయం జనాల్లోకి వెళ్ళిపోయింది. మరి పవన్ ఎప్పుడు నోరిప్పుతారో ఏమో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates