ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యవహార శైలి తరచుగా చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. తాను ఒకప్పుడు చాయ్ వాలా అని.. ఆ స్థాయి నుంచి ప్రధాన మంత్రిని అయ్యానని గొప్పగా చెప్పుకుంటుంటారు కానీ.. ఆ రకమైన సింప్లిసిటీ అయితే ఆయనలో ఎక్కడా కనిపించదు.
తన రాజకీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడ్డ దిగ్గజ నేత అద్వానీతో మోడీ గత కొన్నేళ్లుగా ఎలా ప్రవర్తిస్తున్నాడో అందరం చూస్తూనే ఉన్నాం. మోడీ చోటా నేతగా ఉన్నపుడు అద్వానీ స్థాయే వేరు. అలాంటి సమయంలో మోడీని ప్రోత్సహించి ఈ స్థాయికి రావడానికి పరోక్షంగా కారణమయ్యాడు.
అలాంటి నేతకు పార్టీలో పూర్తిగా ప్రాధాన్యం తగ్గించేయడమే కాదు.. ఆయన పట్ల పలు సందర్భాల్లో అగౌరవపరిచేలా వ్యవహరించారు మోడీ. ఒక సభలో అద్వానీ తనకు నమస్కరిస్తున్నా పట్టించుకోకుండా.. పక్కన్న నేతతో చేతులు కలిపిన వీడియో ఆ మధ్య ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. అదేమీ యాదృచ్ఛికంగా జరిగిందని ఎవరూ అనుకోవడం లేదు.
అద్వానీ లాంటి వాళ్ల పట్ల తానెలా వ్యవహరించినప్పటికీ.. తనకు మాత్రం గౌరవ మర్యాదలు దక్కాలనే మోడీ కోరుకుంటారనడానికి అనేక ఉదాహరణలున్నాయి. తాజాగా వ్యాక్సిన్ పరిశోధనల్ని పరిశీలించేందుకు గాను మోడీ హైదరాబాద్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ‘కోవాగ్జిన్’ను రూపొందిస్తున్న భారత్ బయోటెక్ సంస్థను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈ సంస్థ అధినేతల్లో ఒకరైన రేచస్ ఎల్లా, మరొకరు మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరూ మోడీకి నమస్కరిస్తున్నపుడు మోడీ ఇచ్చిన హావభావాలు ఆశ్చర్యం కలిగించేవే.
రెండుసార్లు నమస్కరించినా సంతృప్తి చెందని మోడీ.. తనకు పాదాభివందనం చేయాలని తలతో సంకేతం ఇచ్చినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆయన కోరుకున్నట్లే రేచస్, అతడి పక్కనున్న వ్యక్తి మోడీకి పాదాభివందనం చేశారు. ఇలా అడిగి మరీ కాళ్లు మొక్కించుకున్న మోడీ తీరు చూస్తే నెటిజన్లు షాకవుతున్నారు. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని మీద కామెంట్లు, జోకులు, మీమ్స్‌కు లెక్కే లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates