15 ఏళ్లు ఈ ప్ర‌భుత్వ‌మే ఉంటుంది: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

రాష్ట్రంలో మ‌రో 15 సంవ‌త్స‌రాల పాటు కూట‌మి ప్ర‌భుత్వ‌మే ఉంటుంద‌ని జ‌నసేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉద్ఘాటించారు. అనేక ఇబ్బందులు, స‌మ‌స్య‌లు, అవ‌మానాలు త‌ట్టుకుని నిల‌బ‌డ్డామ ని.. ఇక‌ముందు కూడా అదే శ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తామ‌ని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. క‌ష్టాలు వ‌చ్చి నా.. 15 సంవ‌త్స‌రాల పాటు ఈ ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని చెప్పారు. క‌ర్నూలు జిల్లాలో నిర్వ‌హించిన సూప‌ర్ జీఎస్టీ-సూప‌ర్ సేవింగ్స్ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అదేస‌మ‌యంలో ప్ర‌ధాని మోడీపై ప్ర‌శంస‌లు గుప్పించారు. మోడీని క‌ర్మ యోగిగా పేర్కొన్నారు. ఆయ‌న ధార్మికంగా ఆలోచించి.. క‌ర్మ యోగిగా ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్ల‌డ‌మే కాకుండా ప్ర‌పంచంలోనే అతి గొప్ప‌దేశంగా నిల‌బెడుతున్నార‌ని అన్నారు. శ‌త్రువుల నుంచి కూడా దేశాన్ని కాపాడుతున్నారని ప్ర‌శంసించారు. ఏమీ ఆశించ‌కుండానే.. దేశానికి సేవ చేస్తున్న ఏకైక ప్ర‌ధానిగా మోడీని అభివ‌ర్ణించారు. ఆయ‌నకు మ‌రో ఆలోచ‌న లేద‌ని.. ఎంత సేపూ.. దేశం, ప్ర‌జ‌ల గురించే ఆలోచ‌న చేస్తున్నార‌ని అన్నారు.

దేశం, ప్ర‌జ‌లు త‌లెత్తుకుని స‌గ‌ర్వంగా చెప్పుకొనేలా ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌ను తీసుకువ‌చ్చార‌ని చెప్పారు. ఇంటా బ‌య‌టా స‌మ‌స్య‌ల‌ను చాక‌చ‌క్యంగా ప‌రిష్క‌రిస్తున్నార‌ని తెలిపారు. ఈ దేశ జెండా ఎంత స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని నిల‌బ‌డిందో అంతే గౌర‌వంగ‌.. గ‌ర్వంగా ప్ర‌పంచ ప‌టంలో దేశాన్ని నిల‌బెట్టిన ఘ‌న‌త ప్ర‌ధానికి ద‌క్కుతుంద‌ని తెలిపారు. ఒక త‌రం కోసం.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు ఎంతో ఆల‌చ‌న చేస్తున్నార‌ని, నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నార‌ని కొనియాడారు.

వారి కోసం.. మ‌నం కూడా నిల‌బ‌డాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపునిచ్చారు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. క‌ష్టాలు వ‌చ్చినా.. త‌ట్టుకుని నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం మ‌న‌పై ఉంద‌న్నారు. మ‌రో 15 ఏళ్ల‌పాటు దేశంలోనూ రాష్ట్రంలోనూ కూట‌మి ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. దీనికి అంద‌రూ క‌ల‌సి కృషి చేయాల‌ని పిలుపుని చ్చారు. ఈ త‌రం కోసం ఆలోచిస్తున్న వారిని స్ఫూర్తిగా తీసుకుని వ‌చ్చే త‌రం కోసం మ‌నం ప‌ని చేయాల‌ని సూచించారు.