రాజకీయాల్లో పార్టీల అధినేతలు, కీలక నాయకులు తలుచుకుంటే టికెట్లకు కొదవ ఏముంటుంది?. ఇప్పుడు కూడా అదే జరిగింది. గత 2023 జనవరిలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ ప్రారంభ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత చేరువగా నిలిచిన బీహార్ యువతి, జానపద గాయకురాలు.. మిథాలీ ఠాకూర్ ఇప్పుడు రాజకీయ నేతగా అవతరించారు. ఆనాడు ఆమె రామచరిత మానస్‌లోని కొన్ని పంక్తులను ఆలపించి.. ప్రధానిని మంత్ర ముగ్ధుడిని చేసింది ఆ యువతి.
దీంతో ఆమెతో సోషల్ మీడియాలో తరచుగా ప్రధాని టచ్‌లో ఉండేవారు. ఇలా.. కలిసిన ఈ బంధం.. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో తన జానపద గీతాలతో బీజేపీ తరఫున ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.. మిథాలీ. అంతేకాదు ప్రధాని పాల్గొన్న సభలకు ముందు కళాకారులతో కలిసి కార్యక్రమాలు నిర్వహించింది. ఇలా పెనవేసుకున్న బంధం.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ రూపంలో మిథాలీని సంతోషపరిచింది. బీజేపీ తరఫున తాజాగా ప్రకటించిన 12 మంది అభ్యర్థుల జాబితాలో మిథాలీ ఠాకూర్ పేరు ఉండడం గమనార్హం.
ఎవరీ మిథాలీ..?
అలీనగర్ ప్రాంతానికి చెందిన మిథాలీ.. జానపద గీతాలానలతో దేశవ్యాప్తంగా 5-6 లక్షల మంది అభిమానులను సంపాయించుకున్నారు. యూట్యూబ్ సహా ఫేస్‌బుక్‌లలో ప్రత్యేక ఖాతాలు ఉన్నాయి. యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన గీతాలను ప్రచారం చేస్తున్నారు. తన గాత్ర మాధుర్యానికి ఎల్లలు లేవనినిరూపించుకున్న మిథాలీకి.. అమెరికా సహా ప్రపంచ దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. బీటెక్ పూర్తి చేసిన మిథాలీ.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి ప్రత్యక ఆహ్వానం అందుకున్నారు. ఇలా.. మొదలైన ఆమె ప్రస్థానం.. ఇప్పుడు అలీనగర్ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకునే దాకా వచ్చింది.
ఆది నుంచి ఊహాగానం..
మిథాలీ టికెట్ వ్యవహారంపై గత కొన్నాళ్లు చర్చలుసాగుతూనే ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాల్లోనూ వార్తలు వచ్చాయి. అయితే.. ఆమె మాత్రం తొలుత చిరాకు ప్రదర్శించారు. ఇక, బీజేపీ పోటీచేస్తున్న 101 స్థానాల్లో(బీహార్‌లో 243 స్థానాలు ఉన్నాయి) తొలి జాబితాలో 57మందిని ప్రకటించారు. కానీ, దానిలో మిథాలీ పేరు లేదు. కానీ, తాజాగా ప్రకటించిన 12 మంది జాబితాలో ఆమె పేరు ప్రముఖంగా ఉండడంతో ఊహాగానం నిజమైంది. ఇక, స్థానికంగా ఉన్న ఆదరణ ఏమేరకు ఆమెకు దోహదపడుతుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates