ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులను హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. తాజాగా మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన చంద్రబాబు.. ప్రధాన మంత్రి షెడ్యూల్ ఖరారైందని.. ఆయన ఢిల్లీ నుంచి ఉదయం కర్నూలుకు వస్తున్నారని తెలిపారు. ఎక్కడా ప్రొటోకాల్ ఇబ్బందులు రాకుండా సంబంధిత మంత్రి చూసుకోవాలని సూచించారు.
అదేవిధంగా మంత్రులు అందరూ వారి వారి నియోజకవర్గాల నుంచి ప్రజలను 10 వేలమంది చొప్పున తరలించేందుకు ఏర్పాట్లుచేయాలన్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. “ప్రధానిని మనం మూడో సారి ఆహ్వానిస్తున్నాం. ఆయన వస్తున్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దు. అందరూ క్రమశిక్షణతో ఉండాలి.” అని మంత్రులకు సూచించారు. గతంలో మోడీ విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చారు.
తర్వాత.. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చారు. ఇప్పుడు కర్నూలులో నిర్వహించే సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు మంత్రులను అలెర్టు చేశారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పేర్కొన్నారు. అయితే.. గతంలో రెండు పర్యటనలలో వివాదాలు వచ్చాయి. కొందరు మంత్రులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో సీఎం ఇలా అలెర్ట్ చేసి ఉంటారని సమాచారం. మరోవైపు.. ఏర్పాట్లను కూడా సీఎం సమీక్షించారు. ప్రధాని పాల్గొనే సభను విజయవంతం చేయాలని సూచించారు.
సభ ఏర్పాట్లు ఇవీ..
- కర్నూలులోని ప్రధాన రహదారిలో ఉన్న వెంచర్‌లో సూపర్ జీఎస్టీ-సూపర్ సవింగ్స్ సభ నిర్వహిస్తారు.
- ఈ సభకు సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రజలను తీసుకురానున్నారు.
- వేదికపై కేవలం పది మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.
- వర్షం వచ్చినా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయిస్తున్నారు.
- ప్రజలకు ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు.
- పార్కింగ్ కోసం ఏకంగా 8 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates