సీఎం రేవంత్‌ను ఒకేసారి త‌గులుకున్నారుగా!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒకేసారి ముగ్గురు కీల‌క నాయ‌కుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. కేటీఆర్‌, ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి , ఎమ్మెల్యే హ‌రీష్‌రావు, బీఆర్ఎస్ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురై.. ఆ పార్టీకి రాజీనామా చేసిన‌.. క‌విత ముగ్గురూ ఒకేసారి త‌గులుకున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను పెంచిన తీరును వారు వేర్వేరుగా దుయ్య‌బట్టారు. సామాన్యుల‌పై భారాలు మోపుతున్నార‌ని క‌విత వ్యాఖ్యానించారు.

గ్రీన్ జ‌ర్నీ పేరుతో సామాన్యుల ర‌క్తం పీల్చుతున్నార‌ని తీవ్రంగా విమ‌ర్శించిన క‌విత‌.. బ‌స్సులు ఎక్కాలంటేనే భ‌య‌ప‌డేలా చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తాజాగా రేవంత్ రెడ్డి స‌ర్కారు ఆర్టీసీ బ‌స్సుల్లో చార్జీల‌ను పెంచింది. దీనిని త‌ప్పుబ‌డుతూ.. కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్ప‌టికే బ‌స్సు పాసుల ధ‌ర‌లు పెంచార‌ని.. ఇప్పుడు చార్జీలు కూడా పెంచ‌డంతో సామాన్యుల‌కు ఇబ్బందిగా మారింద‌న్నారు. చార్జీల‌ను ఒకేసారి రూ.10 చొప్పున పెంచ‌డం ద్వారా.. ఈ ప్ర‌భుత్వం సామాన్యుల‌కు వ్య‌తిరేకి అన్న పేరును శాస్వతం చేసుకుంద‌న్నారు.

అంతేకాదు.. చార్జీల పెంపును దుర్మార్గ‌పు చ‌ర్య‌గా కేటీఆర్ అభివ‌ర్ణించారు. నెల‌కు ఒక్కొక్క‌రిపైనా క‌నీసం రూ.500 మేర‌కు భారం ప‌డుతుంద‌న్నారు. దీనిని భ‌రించ‌లేక .. ఇక‌, ఉద్యోగాలు చేసేవారు.. న‌డిచి వెళ్ల‌డ‌మో గుర్ర‌పు బండ్లు ఎక్క‌డ‌మో చేస్తార‌ని ఎద్దేవా చేశారు. ఇందిర‌మ్మ పాల‌న ఇలానే ఉంటుందా? అని నిలదీశారు. ఇక‌, హ‌రీష్‌రావుకూడా.. దాదాపు ఇదే విధంగా వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో ఆయ‌న మ‌రో విష‌యంపైనా ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు.

ఇటీవ‌ల కురిసిన కుండ‌పోత వ‌ర్షాల‌తో ప్ర‌జ‌లు న‌ష్ట‌పోయార‌ని. వ‌ర‌దల కార‌ణంగా స‌ర్వ‌సం కోల్పోయారని.. వారిని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం ఆదుకోలేద‌న్నారు. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో.. ప్ర‌జ‌లు ఆవాసాలు కోల్పోయార‌ని.. వారికి క‌నీసం భ‌రోసా క‌ల్పించ‌లేద‌న్నారు ఇక‌, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంట‌లు కోల్పోయార‌ని.. వారిని కూడా ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేసింద‌ని వ్యాఖ్యానించారు. ఇలా.. ఒకేసారి ముగ్గురూ త‌గులుకోవ‌డంతో స‌ర్కారుపై విమ‌ర్శ‌ల ప‌ర్వం ఎక్కువైంద‌నే టాక్ వినిపించింది.