ఏ పార్టీకైనా మార్పులు అవసరం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై మరింత పట్టును పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన విజయం దక్కించుకున్నారు. అయితే.. ఇక్కడకు ఆయన రావడం అరుదుగా సాగుతోంది. దీంతో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
అయితే.. మర్రెడ్డిపై స్థానికంగా నాయకులు తీవ్ర అసంతృప్తితో రగులుతున్నారన్నది పార్టీ అధిష్టానానికి కొన్నాళ్లుగా సమాచారం ఉంది. అయితే.. పవన్ ఏరికోరి ఆయనను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించడం తో విమర్శలు వచ్చినా.. ఇన్నాళ్లుగా పట్టించుకోలేదు. కానీ, మరింతగా ఇప్పుడు వివాదాలు సాగుతుండడంతో మార్పు దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. పిఠాపురాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని కూడా పవన్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మర్రెడ్డిని ఆ బాద్యతల నుంచి తప్పిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఏం జరుగుతుంది..?
పిఠాపురం కార్యక్రమాలు అన్నీ.. మర్రెడ్డే చూస్తున్నారు. అయితే.. ఆది నుంచిపార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యం తగ్గించిన ఆయన.. కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వారిని నెత్తినెక్కించుకుంటున్నారన్నది స్థానికంగా వినిపిస్తున్న ప్రధాన విమర్శ. అయితే ఇటువంటి సందర్భాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ వచ్చి సర్ధి చెప్పడం, పార్టీని అందరూ కలిసి కట్టుగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అయినప్పటికీ.. వ్యవహారాల్లో మార్పు రావడం లేదని అంటున్నారు. పైగా. స్థానికంగా జరుగుతున్న పరిణామాలను అధిష్టానం వరకు తీసుకువెళ్లకుండా మర్రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వాదన కూడా ఉంది.
మరోవైపు… మర్రెడ్డి స్థానికంగా లేకపోవడం, విజిటింగ్ గెస్ట్ గా వ్యవహరించడం.. కూడా పార్టీలో సఖ్యత లేమికి కారణంగా మారింది. దీంతో తమ ఇబ్బందులను ఎవ్వరికి చెప్పుకోవాలో అర్ధంకాని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని జనసేన నేతలు వాపోతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పిఠాపురం ఇంచార్జ్ మార్పు జరిగనుందా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. కానీ.. ఇంచార్జ్ మార్పు విషయంలో ప్రస్తుతానికి అటువంటి ఆలోచన ఏమీ లేదన్నది కీలక నాయకులు చెబుతున్న మాట. పార్టీలో అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఉండడం సహజమేనని, అవన్నీ సర్దుకుంటాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates