ష‌ర్మిల దూకుడు.. వైసీపీని దాటేస్తారా ..!

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల దూకుడు పెంచారు. ఒక్క‌సీటు లేక‌పోయినా.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున‌, అదేస‌మ‌యంలో రైతుల త‌ర‌ఫున తాము పోరాటం చేస్తున్నామ‌ని చెబుతున్న ఆమె.. శుక్ర‌వారం అచ్చంగా అదే ప‌ని చేశారు. చ‌లో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. రైతులు, ప్ర‌జ‌ల ప‌క్షాన సీఎం చంద్ర‌బాబును నిల‌దీస్తామ‌ని ఆమె పేర్కొన్నారు. అయితే.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. చిత్రం ఏంటంటే.. ఈ విష‌యాల‌పై పెద్ద ఫోక‌స్ రాలేదు. అయినా. . కూడా ష‌ర్మిల త‌న ప్ర‌య‌త్నాన్ని మాత్రం విర‌మించుకోలేదు.

వాస్త‌వానికి ప్ర‌తిప‌క్షంగా 11 స్థానాలు ద‌క్కించుకున్న వైసీపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ త‌ర‌హ ఉద్య‌మానికి శ్రీకారం చుట్ట‌లేదు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తామ‌ని చెబుతున్న జ‌గ‌న్ కానీ.. ఆ పార్టీ నాయ‌కులు కానీ.. చ‌లో అసెంబ్లీ వంటి ఆలోచ‌న చేయ‌లేదు. నిర‌స‌న రూపంలో జిల్లాల స్థాయిలో క‌దం తొక్కుతున్నామ‌ని చెబుతున్నా.. అవి రాష్ట్ర స్థాయిలో ఇప్ప‌టి వ‌ర‌కు పేరు తెచ్చుకోలేదు. అంతేకాదు.. అస‌లు వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నార‌న్న విషయం లో కూడా పెద్ద‌గా చ‌ర్చ రాలేదు. కానీ, ఇంత‌లోనే ష‌ర్మిల చ‌లో అసెంబ్లీకి పిలుపునిచ్చారు.

దీంతో వైసీపీ ప‌రిస్థితి ఇప్పుడు ఇబ్బందిలో ప‌డింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ష‌ర్మిల నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకుని కామెంట్లు చేశారు. ఎక్క‌డ ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న లేకుండా ఆమె వ‌ద ల్లేదు. దీంతో పార్టీలోనూ ఆమెపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. తొలిసారి నిర్వ‌హించిన చ‌లో అసెంబ్లీ కార్య‌క్ర‌మం లో ఎక్క‌డాజ‌గ‌న్ గురించిన ప్ర‌స్తావ‌న కానీ.. గ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కానీ చేయ‌లేదు. అంటే.. ష‌ర్మిల త‌న వ్యూహాన్ని మార్చుకున్నారు. ఇదే వైసీపీకి మైన‌స్‌గా మారింది.

జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం మానేసి.. ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసుకుని ప్ర‌జ‌లు, రైతుల కోసం ఉద్య‌మించ‌డం ప్రారం భించిన త‌ర్వాత‌.. రాష్ట్రంలో ప్ర‌జ‌లు కూడా ఆమెను గ‌మ‌నించే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. అధికారం వ‌స్తుందా.. రాదా .. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌శ్నించేందుకు ష‌ర్మిల ఉన్నార‌న్న‌వాద‌న బ‌ల‌ప‌డితే.. అప్పుడు వైసీపీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఫ‌లితం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కాబ‌ట్టి.. ఇప్ప‌టికైనా వైసీపీ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌రిశీల‌కులు సూచిస్తున్నారు.