కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి.. మరిని నిధులు ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్(ఏడీబీ) బ్యాంకుల నుంచి రుణం ఇప్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. అదనంగా రూ.14,200 కోట్ల రుణం పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్టు సీఆర్ డీఏ(రాజధాని ప్రాంత సాధికార అధారిటీ) అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో సదరు మొత్తం అప్పుల కోసం.. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకులకు ప్రభుత్వం త్వరలోనే దరఖాస్తు చేయనుందని వివరించారు. దీంతో రాజధానికి మరింత ఊపు రావడం ఖాయమని చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంటు బ్యాంకుల ద్వారా 15 వేల కోట్ల చొప్పున రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనిని వార్షిక బడ్జెట్‌లోనూ ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఆయా బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు 7 వేల కోట్ల చొప్పున రుణం తీసుకుంది.
అయితే.. రుణం ఇచ్చేముందు.. ఆయా బ్యాంకులు కొన్ని షరతులు పెడుతున్నాయి. వాటికి లోబడే నిధులు మంజూరు చేస్తున్నాయి. వాస్తవానికి రుణాలు ఇస్తున్నా.. తాము నిర్దేశించిన పనులకు మాత్రమే ఆయా నిధులను వినియోగించాలని కోరుతున్నాయి. ఇలా.. మౌలిక సదుపాయాల కల్పనకు, డ్రైనేజీల ఏర్పాటుకు మాత్రమే గతంలో నిధులు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వం ప్రధాన నిర్మాణ పనులకు ఈ రుణాల మొత్తాన్నీ వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంజూరు చేసే నిధులను ఇతర నిర్మాణాలకు వినియోగించు కునేలా ఆయా బ్యాంకులను ఒప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు.. గత కేంద్ర వార్షిక బడ్జెట్లో అమరావతి కోసం 1400 కోట్ల రూపాయలను గ్రాంటుగా ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో దీనిని 3000 కోట్ల వరకు పెంచాలని ఇటీవల చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నవించారు. అదేసమయంలో రాష్ట్ర బడ్జెట్‌లోనూ అమరావతి కోసం 2000 కోట్ల రూపాయలను కేటాయించారు. దీంతో పనులు వేగంగా సాగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక, 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates