తాజాగా గురువారం మధ్యాహ్నం నుంచి ఓ సంచలన వార్త.. మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏపీలో వైసీపీ పాలనా కాలంలో జరిగినట్టు ప్రస్తుత ప్రభుత్వం, అధికారులు పేర్కొంటున్న లిక్కర్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నారనేది వార్త సారాంశం. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీలలో ఈ దాడులు జరుగుతున్నాయి. అంటే.. దీనిని బట్టి.. వైసీపీ హయాంలో జరిగినట్టు సర్కారు చెబుతున్న మద్యం కుంభకోణం కేసు విచారణకు ఈడీకి అప్పగించారా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
వాస్తవానికి దీనిపై ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా.. సీబీఐ, ఈడీలు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎక్కడా ప్రకటించలేదు. మరి అనూహ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్టు చెబుతున్న లిక్కర్ కుంభకోణంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయడం ఏంటనేది చర్చ. అయితే.. దీనిపై ఇటు ప్రభుత్వం కానీ.. అటు కేంద్ర దర్యాప్తు సంస్థకానీ.. ఎక్కడా స్పందించలేదు. కనీసం పన్నెత్తు మాట కూడా అనలేదు. రాష్ట్ర మంత్రులు కూడా ఈ విషయంపై మౌనంగానే ఉన్నారు.
మరోవైపు.. ఈడీ మాత్రం రెండు ప్రధాన లిక్కర్ కేసులను దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకటి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంతోపాటు.. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ సీఎం భూపేష్ భగల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న కుంభకోణం.. ఈ రెండు కేసులను ఈడీ విచారిస్తోంది. భగల్ కుమారుడిని కూడా గత నెలలో అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆ రెండు కేసులకు సంబంధించి న సమాచారం కూపీలాగేందుకు ఈడీ ఈ రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తోందన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
అలాకాదు.. వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణంపైనే విచారణ చేస్తోందని భావిస్తే.. ఖచ్చితంగా అది సీరియస్‌గా నే మారుతుంది. గతంలో ఈడీ అధికారులు విజయవాడకు వచ్చి.. ఈ కేసులో ఏ1-గా ఉన్న రాజ్ కసిరెడ్డిని విచారించారు. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యారు. తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. అవి పూర్తికాగానే.. మళ్లీ ఈడీ అధికారులు సోదాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదేమైనా.. ప్రస్తుతం జరుగుతున్న సోదాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates