ప్రజాప్రతినిధులు బయట ఎన్ని మాట్లాడినా.. అసెంబ్లీలోను, పార్లమెంటులోనూ మాట్లాడేదానికి ఒక విలువ.. ఒక రికార్డు ఉంటాయి. అంతేకాదు.. బయట ఎన్ని మాట్లాడినా ప్రభుత్వం బుల్ డోజ్ చేయొచ్చు. కానీ.. అసెంబ్లీ, పార్లమెంటులో మాట్లాడినా.. సభ్యులు ప్రశ్నలు అడిగినా.. ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పి తీరుతుంది. ఎందుకంటే.. ఈ రెండు సంస్థలు కూడా రాజ్యాంగ బద్ధం. సో.. అందుకే.. పార్లమెంటు, అసెంబ్లీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది.. మన రాజ్యాంగం.
మరి అలాంటి రాజ్యాంగ బద్ధమైన అసెంబ్లీని వినియోగించుకుని ప్రజలకు సేవ చేయాలని అనేక మంది నాయకులు పోటీ పడడం తెలిసిందే. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారు ఎంత మంది ఉన్నారనేది కూడా తెలిసిందే. అయితే.. అలాంటి అవకాశం వచ్చి కూడా.. చిన్న విషయం పట్టుకుని భీష్మించుకుని కూర్చుంటే..? సభకు వెళ్లకపోతే.. ఎవరికి నష్టం? అంటే.. ఖచ్చితంగా వెళ్లనివారికే నష్టం.. ఎవరైతే.. సభకు వెళ్లకుండా ఉన్నారో.. వారి పార్టీకే నష్టం. ఇది చాలా సింపుల్. గతంలో రెండే రెండు పార్లమెంటు స్థానాలు దక్కించుకున్న బీఆర్ఎస్(అప్పట్లో టీఆర్ ఎస్) పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడింది.
రెండే సీట్లు వచ్చాయని.. ఎక్కడా కేసీఆర్ ఇంట్లో కూర్చోలేదు. ఇక, కేవలం 4 పార్లమెంటు స్థానాలతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ.. నేడు దేశాన్ని ఏలుతున్న విషయం తెలిసిందే. సో.. ప్రజలు అన్నీ గమనిస్తారు. కానీ.. వైసీపీ విషయానికి వస్తే.. మాత్రం ‘ప్రధాన ప్రతిపక్ష హోదా’ కోసం పట్టుబడుతూ.. సభను బాయ్ కాట్ చేయడం సహజంగా మారిపోయింది. తమకు సీఎం తర్వాత.. స్థాయి కావాలని.. సీఎంకు ఎంత సమయం సభలో మాట్లాడే.. అవకాశం ఇస్తారో.. మాకు కూడా అంతే సమయం ఇవ్వాలని కోరుతూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సభకు వెళ్లకుండా భీష్మించుకున్నారు.
ఇంట్లో కూర్చుని మీడియా మీటింగులకు పరిమితం అవుతున్నారు. కానీ, ప్రజలు ఆయనను, ఆయన పార్టీ వ్యవహారాన్ని కూడా గమనిస్తున్నారు. ప్రజల తరఫున ఎన్నయినా.. బయట మాట్లాడొచ్చు.. ఎన్ని రకాలుగా అయినా.. మద్దతు తెలపవచ్చు. కానీ, సభ అంటూ జరుగుతున్నప్పుడు.. సభకు వెళ్లాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధిగా జగన్‌కు ఆయన పార్టీ సభ్యులకు కూడా ఉంటుంది. కానీ, జగన్ తాను వెళ్లకుండా.. తన వారిని కూడా కట్టడి చేస్తున్నారు. ఈ పరిణామాలు.. తనకు శోభిస్తాయని ఆయన అంచనా వేసుకుని ఉంటారు. కానీ, ఇది సరికాదన్నది పరిశీలకులు చెబుతున్నమాట.
గతంలో 2019 ఎన్నికల సమయంలో కేవలం 23 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. టీడీపీ అధినేత చంద్రబాబు సభకు వెళ్లారు. చివరకు తన కుటుంబ సభ్యులను సభలో అవమానించారని పేర్కొంటూ.. ఆయన సభను బాయి కాట్ చేసినా.. తన సభ్యులు 22 మందిని పంపించారు. కానీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న జగన్ తాను వెళ్లకపోగా.. ఇతర ఎమ్మెల్యేలు 10 మందిని కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నది తెలిసిందే. దీని వల్ల వ్యక్తంగా ఆయన ప్రతిష్ట పోగొట్టుకోవడంతోపాటు.. ప్రజల మధ్య కూడా ఆయన చులకన అవుతారన్నది పరిశీలకులు చెబుతున్న మాట.
ప్రజలు ఎన్నో ఆశలతో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. తమ తరఫున గళం వినిపిస్తారని ఆశలు పెట్టుకుంటారు. తమ సమస్యలు సభలో ప్రస్తావిస్తారని అనుకుంటారు. కానీ, ఇవన్నీ మరిచిపోయిన జగన్.. తన మంకు పట్టుకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప.. వాస్తవాలను గ్రహించలేకపోతున్నారని సొంత పార్టీలోనూ చర్చ సాగుతోంది. ఏదేమైనా.. సభకు ఆయన హాజరు అయితే.. ఎంతో కొంత సమయం అయితే ఇవ్వకుండా ఉండరు కదా..?.. ఆ సమయాన్నే సద్వినియోగం చేసుకుంటే.. అంతా ప్రజలు గమనిస్తారు కదా! అనే చిన్న ఆలోచనను జగన్ మిస్ అవుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates