“మోహిత్ రెడ్డిని అరెస్టు చేయాల్సిందే”

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి త‌న‌యుడు.. యువనేత‌ మోహిత్ రెడ్డిని అరెస్టు చేయాల్సిందేన‌ని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు కోర్టుకు తెలిపారు. ఆయ‌న పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్‌పై త్వ‌ర‌గా విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో మొత్తం 3500 కోట్ల రూపాయ‌ల మేర‌కు చేతులు మారాయ‌ని సిట్ అధికారులు తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లువురు నిందితుల‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇదేస‌మ‌యంలో ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ను కూడా దాఖ‌లు చేశారు.

తాజాగా మూడో చార్జిషీట్‌(ఇది రెండో చార్జిషీట్‌కు అనుబంధం)ను విజ‌య‌వాడ‌లోని ఏసీబీకోర్టులో దాఖ‌లు చేశారు. దీనిలో మోహిత్ రెడ్డి పాత్ర కు సంబంధించిన కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ముంద‌స్తు బెయిల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న మోహిత్ రెడ్డిపై పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవ‌ల‌.. ఈ ఆదేశాల‌ను కూడా పొడిగించింది. అయితే.. ఇలా ఉద్దేశ పూర్వ‌కంగానే.. ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ‌కుండా అడ్డుకుంటున్నార‌ని కూడా సిట్ అధికారులు కోర్టుకు వివ‌రించారు. ఇదిలావుంటే.. మ‌ద్యం కుంభ‌కోణంలో మోహిత్ రెడ్డి పాత్ర‌ను కూలంక‌షంగా వివ‌రించారు.

వైసీపీ హ‌యాంలో తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ(తుడా)చైర్మ‌న్‌గా ఉన్న మోహిత్ రెడ్డి.. అధికారికంగా మూడు వాహ‌నాలు వినియోగించార‌ని తెలిపారు. మ‌ద్యం అక్ర‌మాల ద్వారా వ‌చ్చిన సొమ్మును ఆ వాహ‌నాల్లోనే త‌ర‌లించిన‌ట్టు త‌మ‌కు ఆధారాలు ఉన్నాయ‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ వాహ‌నాలు వినియోగించిన‌ప్పుడు.. వాటికి సంబంధించిన వివ‌రాల‌ను న‌మోదు చేయాల‌ని(లాగ్ బుక్‌), కానీ.. మోహిత్ రెడ్డి అలా న‌మోదు చేయ‌లేద‌ని తెలిపారు. ఇది ఉద్దేశ పూర్వ‌క ఉల్లంఘ‌న‌గా అధికారులు పేర్కొన్నారు. ఇలా ఎందుకు న‌మోదు చేయ‌కుండా వ‌దిలేశారో అనే దాంట్లోనే కుట్ర కోణం ఉంద‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యాల‌ను వెలుగులోకి తెచ్చేందుకు.. తెర‌వెనుక ఏం జ‌రిగిందో తెలుసుకునేందుకు మోహిత్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తాజాగా చార్జిషీట్‌లో స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. చెవిరెడ్డి కుటుంబం పేరిట ప‌లు కంపెనీలు ఉన్నాయ‌ని.. వాటి పేరుతో కూడా నిధుల‌ను దారి మ‌ళ్లించార‌ని చార్జిషీట్‌లో స్ప‌ష్టం చేశారు. ఈ కేసులో మోహిత్ రెడ్డి పాత్ర కూడా కీల‌కంగా ఉంద‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను అరెస్టు చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని.. అనంత‌రం.. త‌మ క‌స్ట‌డీకి కూడా ఇవ్వాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. అయితే.. ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ హైకోర్టులో ఉండ‌డంతో ఏసీబీ న్యాయ‌స్థానం దీనిపై ఎలాంటి ఉత్త‌ర్వులు ఇస్తుందో చూడాలి.