జగనన్న కాలనీకి పవనన్న బ్రిడ్జి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండానే తన పని తాను సైలంట్ గా చేసుకుపోతున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్న పవన్ ఆయా ప్రాంతాల ప్రజల మన్ననలను చూరగొంటున్నారు. అంతేకాకుండా అంతకుముందు పాలించిన నేత పనితీరు ఎలా ఉందన్న విషయాన్ని కూడా పవన్ పనితీరుతో జనం విశ్లేషించుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో చోటుచేసుకుంది. జగనన్న కాలనీకి ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టి మరీ పవన్ బ్రిడ్జి కట్టించారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… వైసీపీ జమానాలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చి, అందులో ఇల్లు కట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇల్లు కట్టుకోకపోతే ఇచ్చిన స్థలాలను వెనక్కు తీసుకుంటామని కూడా వైసీపీ నేతలు బెదిరించారు. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో అప్పులు చేసి మరీ లబ్ధిదారులు ఇళ్లు కట్టుకున్నారు. అయితే వాటికి కనీస మౌలిక సదుపాయల కల్పనను జగన్ సర్కారు మరిచింది. ఇక లబ్ధిదారులందరికీ ఒకే చోట స్థలాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ కాలనీలకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టేశారు. ఇలాంటి జగనన్న కాలనీ పిఠాపురం పరిధిలోని గొల్లప్రోలులోనూ ఉంది. 1,500 ఇళ్లు ఇప్పటికే నిర్మాణం కాగా… వాటిలో లబ్దిదారులు నివాసం కూడా ఉంటున్నారు. మరికొన్ని ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.

ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా… వర్షాకాలం వచ్చిందంటే చాలు గొల్లప్రోలు జగనన్న కాలనీ వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లలేరు. పిల్లలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లలేరు. ఎందుకంటే… జగనన్న కాలనీని గొల్లప్రోలుతో కలిపే మార్గంలో పెద్ద కాలువ ఉంది. ఎగువ భాగాన వర్షం పడినా ఈ కాలువ పొంగిపొరలుతుంది. ఇక గొల్లప్రోలు పరిధిలో వర్షం పడిందంటే.. ఇక జగనన్న కాలనీ వాసుల కష్టాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇలాంటి పరిస్థితి గురించి తెలిసి వచ్చాకో, లేదంటే క్యాజువల్ గానే జగనన్న కాలనీకి వచ్చారో తెలియదు గానీ… గతేడాది సెప్టెంబర్ 9న పవన్ అక్కడికి వచ్చారు. పరిస్థితిని గమనించారు. అంతే… క్షణకాలం ఆలస్యం లేకుండా గొల్లప్రోలు, జగనన్న కాలనీల మధ్య బ్రిడ్జీ నిర్మించాలని తీర్మానించారు. అందుకు ఏకంగా రూ.5 కోట్ల నిధులను మంజూరు చేశారు.

ఏదో బ్రిడ్జిని మంజూరు చేయడం, నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేయడంతోనే తన పని అయిపోయిందని భావించని పవన్ అక్కడ పనులను యుద్దప్రాతిపదికన ప్రారంభమయ్యేలా చేశారు. పనుల్లో ఏమాత్రం వేగం తగ్గకుండా చూశారు. సరిగ్గా ఏడాదిలోనే అంటే ఈ సెప్టెంబర్ లోనే బ్రిడ్జి పనులు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు కుంభవృష్టి పడ్డా, ఆ కాలువ మరింతగా పొంగిపొరలినా… పిల్లలు సంతోషంగా బ్రిడ్జిపై నుంచి తమ విద్యాభ్యాసం నిమిత్తం వెళ్లిపోతున్నారు. తిరిగి వస్తున్నారు. చిరుద్యోగులు వారి పనులకు విరామం లేకుండా వెళ్లగలుతున్నారు. ఇప్పుడు అక్కడికెళితే… జగన్ స్థలాలే ఇచ్చారు..ఆ స్థలాలకు అవసరమైన మౌలిక వసతులను పవన్ ఏర్పాటు చేస్తున్నారు అంటూ అక్కడి జనం చెబుతున్నారు.