సోషల్ మీడియాలో ఓ వీడియో నిన్న రాత్రి నుంచి తెగ వైరల్ అవుతోంది. అందులో పెద్దగా ఏమీ లేదు గానీ.. ఏపీలోని విపక్షం వైసీపీలోని కీలక విభాగం పీఏసీ సభ్యుడిగా ఇటీవలే ఎన్నికైన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిలో టీడీపీ కీలక నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ కనిపించారు. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటిలో నుంచి ఇద్దరు నేతలు కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నారు.
ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన ముద్రగడ హైదరాబాద్ వెళ్లి ఆపరేషన్ చేయించుకుని మరీ వచ్చారు. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు, ముద్రగడ స్నేహితులు ఆయన ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించి వెళుతున్న వైనం తెలిసిందే. అయితే జిల్లాల పునర్విభజనకు ముందు ఒకే జిల్లాకు చెందిన నేతలు తప్పించి వారి మధ్య ఎలాంటి ఇతరత్రా సంబంధాలు కూడా లేవు. వీరిద్దరి సామాజిక వర్గాలు కూడా వేర్వేరే. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి వర్మ నేరుగా ముద్రగడ ఇంటిలో ప్రత్యక్షం కావడం, ఆయనకు ముద్రగడ సాదరంగా స్వాగతం పలకడం చూస్తుంటే రాజకీయంగా ఏదైనా కీలక పరిణామాలు జరుగుతున్నాయా? అన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
ముద్రగడకు ఒక్క వైసీపీతోనే కాకుండా దాదాపుగా అన్ని పార్టీల్లోని కీలక నేతలందరితోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. నేరుగా టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతోనూ ఆయనకు పరిచయాలు ఉన్నాయి. బీజేపీలోని కీలక నేతలతోనూ, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అవినీతి మరక అంటని ముద్రగడ… తన సామాజిక వర్గం ఉన్నతి కోసం అలుపెరగని ఉద్యమం సాగించడం ఆయనను రాష్ట్రంలో ఓ హీరోయిక్ నేతగా ఎదిగారు. తన సామాజిక వర్గం కోసం ముద్రగడ అన్ని పార్టీలను కూడా ఎదిరించారు. పోరాడారు.
అలాంటి ముద్రగడను ఇప్పుడు వర్మ కలవడం వెనుక కారణం ఏమై ఉంటుందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఇంతటి విశ్లేషణలకు మరో కారణమూ లేకపోలేదు. ముద్రగడ ఇంటి నుంచి వర్మ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వెళ్లిపోతున్నారు. అంత రాత్రి వేళ ముద్రగడ ఇంటికి వర్మ వచ్చారంటే… తమ భేటీ ఎవరికీ తెలియరాదనే కదా. అందులో భాగంగా ఈ వీడియోను అటు టీడీపీ గానీ, జనసేన గానీ విడుదల చేయకపోగా… ఎక్కడ వైసీపీని ముద్రగడ వీడతారోనన్న భయంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు దానిని విడుదల చేశారు. మరి రాత్రి వేళ జరిగిన ఈ చర్చల్లో ఏం జరిగిందన్న విషయం ఎప్పుడు వెల్లడి అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates