వెరీ స్పెషల్!…మోదీతో లోకేశ్ భేటీ!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో లోకేశ్ భేటీ అయ్యారు. నాలుగు నెలల క్రితం తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి మోదీని లోకేశ్ కలిసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలు తిరక్కుండానే రెండోసారి మోదీతో లోకేశ్ భేటీ కావడం గమనార్హం. ఈ భేటీతో అత్యంత ప్రత్యేకంగా జరిగినట్లుగా విజువల్స్ ఆధారంగా తెలుస్తోంది.

సాధారణంగా ప్రధానిని ఎవరు కలిసినా.. పరస్పరం అభివాదం చేసుకోవడం, ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చోవడం వరకే విజువల్స్ బయటకు వస్తాయి. ఇక మిగిలిన తంతు ఏమిటన్నది దాదాపుగా బయటకు రాదు. అయితే శుక్రవారం నాటి మోదీ, లోకేశ్ బేటీలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. తనను కలిసేందుకు వచ్చిన లోకేశ్ కు తేనీటి విందు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను మోదీ చేయించారు. ఈ ఫొటోలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎంత పెద్ద నేత వెళ్లినా కూడా ఈ తరహా ఏర్పాట్లు ఉంటాయో, లేవో తెలియదు గానీ… ఆ ఫొటోలు అయితే ఇప్పటిదాకా ఒక్కటి కూడా బయటకు రాలేదు. అయితే లోకేశ్ భేటీలో ఈ ఫొటోలు కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

2024 ఎన్నికల్లో ఏపీలో కూటమికి అత్యధిక మెజారిటీ సాధించారన్న భావనతో లోకేశ్ ను మోదీ ఎంతో అభిమానిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు బలోపేతానికి కూడా లోకేశే కారణమన్నభావన కూడా మోదీకి ఉన్నట్లే లెక్క. ఈ కారణంగానే లోకేశ్ ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా ఆయనను దగ్గరకు పిలుచుకుని మరీ ఆయనతో ఓ స్నేహితుడిలా మోదీ మాట్లాడుతూ ఉంటారు. ఫ్యామిలీతో ఢిల్లీ రావాలని ఎన్నిసార్లు పిలవాలి? అంటూ విశాఖ టూర్లో లోకేశ్ ను మోదీ ప్రశ్నించారు. అలా లోకేశ్ పట్ల మోదీ ఆప్యాయత అంతకంతకూ పెరుగుతూ వస్తోందనే చెప్పాలి. ఆ ఆప్యాయత శుక్రవారం నాటి భేటీలో ప్రత్యేకంగా కనిపించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే… మోదీతో 45 నిమిషాల పాటు సాగిన భేటీలో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. జీఎస్టీ శ్లాబులను తగ్గించిన తీరు, ఫలితంగా పాఠశాలల్లో వినియోగించే వస్తువుల ధరలు తగ్గిన వైనంపై మోదీకి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీకి కేంద్ర సాయం, అమరావతి, పోలవరం నిర్మాణాలు తదితరాలను లోకేశ్ ప్రస్తావించారు. అదే సమయంలో ఏపీలో పెట్టుబడుల రాక, పరిశ్రమల స్థాపన గురించి కూడా మోదీకి లోకేశ్ వివరించారు. ఇక ఇటీవల సింగపూర్ లో ఏపీ బృందం జరిపిన పర్యటన వివరాలను కూడా ఆయన మోదీకి వివరించారు. తమకు సింగపూర్ లో ఎదురైన అనుభవాలను లోకేశ్ సవివరంగా తెలిపినట్లు తెలుస్తోంది. లోకేశ్ చెప్పిన విషయాలన్నీ మోదీ ఆసక్తిగా విని అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారు.