వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తన సొంత నియోజకవర్గం పులివెందులలో సోమవారం పర్యటించారు. ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత.. ఆయన పర్యటించడం ఇదే తొలిసారి. అయితే.. సాధారణంగా జగన్ అనగానే.. భారీ జనసందోహం కామనేకదా. అలానే వచ్చారు. పార్టీ సీనియర్లు రాకపోయినా.. వారి అనుచరులు , ద్వితీయ శ్రేణి నాయకులు కూడా జగన్ కోసం వచ్చారు. అయితే.. జగన్ కు ఈ సమయంలోనే ఊహించని విధంగా షాక్ తగిలింది. ఆయన అనుకున్నది ఒకటైతే.. జరిగింది మరొకటి. జగన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు కార్యకర్తలు భారీ ఎత్తున పోటీ పడ్డారు. ఆయన కారు కూడా దిగకుండా.. సెల్ఫీల కోసం వచ్చారు. దీంతో జగన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
అయితే.. చిత్రం ఏంటే.. సెల్పీల కార్యక్రమం అయిపోయి.. కార్యకర్తలను ఉద్దేశించి కార్యక్రమాన్ని ప్రారంభించే సమయానికి వచ్చిన వారిలో సగం మంది జంప్ అయ్యారు. దీంతో జగన్ ఆసక్తి కొద్దీ.. “ఇందాకొచ్చినోళ్లు ఏమయ్యారన్నా?” అని ప్రశ్నిం చారు. దీంతో సీనియర్ నాయకుడు సుబ్బారెడ్డి.. స్పందిస్తూ..”వాళ్లంతా వెళ్లిపోయారు సర్. సెల్ఫీల కోసం వచ్చారు” అని బదులిచ్చారు. నిజానికి ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగకపోవడంతో జగన్ కూడా ఒకింత షాకయ్యారు. అనంతరం సమావేశంలో ఉన్నవారితోనే ఆయన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తేల్చి చెప్పారు.
పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ముఖ్యంగా గతంలో సమస్యలు వినని జగన్.. ఈ దఫా వారి నుంచి సమస్యలు ఓపిగ్గా విన్నారు. ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు నేతలు జగన్ వద్ద వాపోయినట్టు తెలిసింది. అయితే.. వారికి జగన్ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని.. అందరూ హ్యాపీగా ఉండాలని ఆయన సూచించారు. టీడీపీ నేతల అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు.
ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని జగన్ మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలిగానీ.. కీడు చేయకూడదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశామని గుర్తు చేశారు. టీడీపీ కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేయడం పక్కనపెట్టి తమ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకుందని అన్నారు. ఇదిలావుంటే..జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే జగన్‌ను కలుసుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates