ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణాన్ని విచారిస్తున్న విజయవాడలోని ఏసీబీ కోర్టులో వింత, విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అది కూడా వైసీపీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టైన తర్వాత ఈ వింతలు ఓ రేంజికి పెరిగిపోయాయి. అరెస్టైన కొత్తలో అటు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయం ప్రాంగణం, ఇటు ఏసీబీ కోర్టు ప్రాంగణంలో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ కేకలేసిన చెవిరెడ్డి… మంగళవారం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు వెక్కివెక్కి ఏడ్చారట.
లిక్కర్ స్కాంలో చెవిరెడ్డికి కూడా పాత్ర ఉందని సిట్ చాలా కాలం క్రితమే గుర్తించింది. లిక్కర్ దందా ద్వారా వచ్చిన మొత్తాన్ని చెవిరెడ్డి ఎన్నికల్లో ఖర్చు పెట్టారని, అందుకోసం తన అనుచరులు, స్నేహితులను సహకారాన్ని కూడా తీసుకున్నారన్నది సిట్ ప్రధాన ఆరోపణ. అయితే అసలు తనకు లిక్కర్ స్కాంతో సంబంధమే లేదని, పోలీసులు అరెస్టు చేయాలనుకుంటే చేసుకోవచ్చని పలుమార్లు సవాల్ విసిరి… చివరాఖరుకు సిట్ అధికారులు తన అరెస్టుకు రంగం సిద్ధం చేయడంతో ఎంచక్కా పారిపోయేందుకు చెవిరెడ్డి యత్నించారు. ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారుల సహకారంతో సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్టు చేసి విజయవాడ తరలించారు.
ఆ సందర్భంగా కోర్టుకు తరలించేటప్పుడు మీడియా దృష్టిని ఆకర్షించేందుకు చెవిరెడ్డి నానా యాగీ చేశారు. తాను మద్యమే తాగనని, అలాంటి తాను మద్యం కుంభకోణంలో చేతులు ఎలా కలుపుతానని వాదించారు. అంతేకాకుండా మద్యం కారణంగా తన కుటుంబం ఇద్దరు వ్యక్తులను కోల్పోయిందని, నాటి నుంచి మద్యపానానికి గానీ, మద్యం వ్యాపారానికి తమ కుటుంబం దూరంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇవేవీ తెలియని సిట్ అధికారులు అకారణంగా, కేవలం రాజకీయ కారణాలతో తనను కక్షపూరితంగా అరెస్టు చేసిందని కేకలు వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సిట్ చేస్తున్న దురాగతాలను దేవుడు చూస్తున్నాడని, తగిన సమయంలో బాధ్యులకు గుణపాఠం తప్పదని కూడా వార్నింగులు ఇచ్చారు.
తాజాగా లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో వారందరినీ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే చెవిరెడ్డి కోరిక మేరకు ఆయనను వర్చువల్ గా హాజరుపరుస్తామని అధికారులు చెప్పగా… అందుకు న్యాయమూర్తి ఒప్పుకోలేదు. దీంతో చెవిరెడ్డిని కూడా కోర్టుకు తీసుకురాగా… న్యాయమూర్తిని చూడగానే చెవిరెడ్డి బోరుమని ఏడ్చారట. తనకు నడుము నొప్పి ఉందని, జైలు అధికారులకు చెప్పినా వైద్యం చేయించలేదని ఆయన కోర్టుకు చెప్పారు. భరించలేని నడుము నొప్పి కారణంగా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన అక్కడిక్కడే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ధైర్యస్తుడిగా కనిపించే చెవిరెడ్డి అలా కోర్టులో బోరుమని విలపించడంతో అక్కడి వారు అవాక్కయ్యారు. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి తీర్పును ఈ నెల 30కి వాయిదా వేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates