విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్.. ఉరఫ్ నాని వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది. విజయవాడ పాలిటిక్స్‌లో తనదైన ముద్ర వేసిన నాని.. టీడీపీ తరఫున రెండు సార్లు ఎంపీగా విజయం దక్కించుకున్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు .. టీడీపీతో విభేదించారు. తన సోదరుడికి ప్రాధాన్యం ఇస్తున్నారని.. తనను పక్కన పెట్టారని భావించిన ఆయన టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత.. ఓ ఫైన్ మార్నింగ్ వైసీపీలోకి జంప్ చేశారు. ఈ పార్టీ నుంచే గత ఏడాది పోటీ కూడా చేశారు.
అయితే.. కూటమి ప్రభావం, వైసీపీ గ్రాఫ్ తగ్గిపోయిన దరిమిలా నాని పరాజయం పాలయ్యారు. ఆ వెంటనే ఆయన తన కుమార్తె సహా తాను కూడా రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పారు. అలానే చేశారు. అయితే.. ఇటీవల కాలంలో మళ్లీ రాజకీయంగా తెరమీదికి వచ్చారు. కూటమి సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వైసీపీ.. కేశినేనిని తమవైపు మలుచుకునే ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. వైసీపీని కాదని వెళ్లిపోయినా.. ఆ పార్టీపై నాని ఎలాంటి విమర్శలు చేయలేదు.
పైగా.. కూటమి ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. సో.. దీనిని బట్టి తమకు స్కోప్ ఉందని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి మరోసారి ప్రయత్నాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే.. ఈ దఫా.. కీలక నాయకుల ద్వారా కేశినేనిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మమ్మరం అయ్యాయని తెలిసింది. కేశినేని గ్రాఫ్ తగ్గక పోవడంతోపాటు.. ఆయనకు ఉన్న బ్యాక్ గ్రౌండ్‌లపై వైసీపీ ఆరా తీసింది. ఆయన హవా ఏమాత్రం తగ్గలేదని నిర్ధారణకు వచ్చింది.
ఈ క్రమంలోనే.. వైసీపీలో ఉన్న కమ్మ నాయకుడి ద్వారా చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసిం ది. వైసీపీలో అనేక మంది కమ్మ నాయకులు ఉన్నారు. అయితే.. ఒకరిద్దరు వ్యాపారాల పరంగా నానీకి టచ్‌లో ఉన్నారు. దీంతో వారి ద్వారా కేశినేనిని మచ్చిక చేసుకుని ముందుకు సాగాలన్నది వైసీపీ వ్యూహం. ఈ క్రమంలోనే ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. అయితే.. దీనికి సంబంధించి.. నాని నుంచి పెద్దగా స్పందన లేదని సమాచారం. ఎన్నికల సమయానికి అయినా.. ఆయనను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో వైసీపీ ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates