బాల‌య్య కొత్త రికార్డు: చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఇదే!

టీడీపీ ఎమ్మెల్యే, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ స‌రికొత్త రికార్డు సృష్టించారు. తెలుగు సినీ రంగంలో 50 ఏళ్లుగా త‌న న‌ట విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న నంద‌మూరి బాల‌య్య.. సుప్ర‌సిద్ధ‌ వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌(గోల్డ్ ఎడిష‌న్‌)లో చోటు సంపాయించుకున్నారు. బాల న‌టుడిగా ప్ర‌స్థానం ప్రారంభించిన బాల‌య్య‌.. అనేక‌ సినిమాల్లో త‌నదైన శైలితో ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్ధుల‌నుచేశారు. అన్న‌గారు ఎన్టీఆర్‌తో స‌మానంగా.. ఆయ‌న వార‌సుడిగా తెరంగేట్రం చేసిన బాల‌య్య‌.. అనేక రికార్డులు నెల‌కొల్పారు. ఈ క్ర‌మంలో బాల‌య్య‌కు అరుదైన ఘ‌న‌త‌గా వ‌రల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు ల‌భించింది.

ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని బాల‌య్య‌కు వియ్యంకుడు, బావ కూడా అయ్యే ఏపీ సీఎం చంద్ర‌బాబు సంతోషం వ్య‌క్తం చేశారు. తెలుగు చ‌ల‌న చిత్ర రంగంలోనే కాకుండా.. దేశ సినీ ప‌రిశ్ర‌మంలో కూడా బాల‌య్య ఘ‌నత అజ‌రామ‌ర‌మ‌ని కొనియాడారు. చేప‌ట్టిన వృత్తి ప‌ట్ల అంకిత భావం, సేవ వంటివి బాల‌య్య‌కు ఈ స్థాయిలో గుర్తింపు ల‌భించింద‌ని పేర్కొన్నారు. బాల‌య్య సినీ ప్ర‌స్థానంలో వ‌రల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక చ‌రిత్రాత్మ‌క మైలు రాయి అని చంద్ర‌బాబు అభివ‌ర్ణించారు. కోట్ల మంది ప్రేక్ష‌కుల అభిమానం సొంతం చేసుకున్న బాల‌య్య‌.. మ‌రింతగా సినీ రంగంలో వెలుగొందాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్టు తెలిపారు.

ఇద్ద‌రు అల్లుళ్లు కూడా..

బాల‌య్య ఇద్ద‌రు అల్లుళ్లు.. కూడా ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపారు. పెద్ద‌ల్లుడు, మంత్రి నారా లోకేష్‌, చిన్న‌ల్లుడు, విశాఖ ఎంపీ భ‌ర‌త్‌లు బాల‌య్యకు ద‌క్కిన అరుదైన గౌర‌వంపై.. హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సినీ రంగంలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్ర‌స్థానాన్ని పూర్తి చేసి.. మ‌రో 50 ఏళ్ల ప్ర‌స్థానం దిశ‌గా అడుగులు వేస్తున్న మావ‌య్య‌కు హార్ధిక శుభాకాంక్ష‌లు అని పేర్కొన్నారు. వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాయించ‌డం.. త‌మ రెండు(నంద‌మూరి-నారా) కుటుంబాల‌కే కాకుండా.. బాల‌య్య ఆరాధించే, అభిమానించే కోట్లాది మంది ప్రేక్ష‌కులకు కూడా పండుగేన‌ని భ‌ర‌త్ పేర్కొన్నారు. కాగా.. బాల‌య్య ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఒక‌వైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు సినీ రంగంలో త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు.