ఏపీ రాజధాని అమరావతిని అన్ని కోణాల్లోనూ ప్రమోట్ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు.. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అమరావతి పేరును జగద్వితం చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టకుండా అమరావతిని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడుల పేరుతో రాజధాని పేరును ప్రపంచ వ్యాప్తంగా వినిపించేలా చేశారు. అదేవిధంగా ‘క్వాంటమ్ వ్యాలీ’, ఏఐ యూనివర్సిటీ వంటి కీలక రంగాల్లోనూ అమరావతి పేరు వినిపించేలా చేస్తున్నారు.
ఇక, ఇప్పుడు మరో రూపంలో అమరావతి ప్రమోషన్‌ను మరింత క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే కార్యాచరణకు రంగం రెడీచేశారు. దీనిలో భాగంగా అమరావతి పేరుతో క్రీడలను ప్రారంభించారు. ‘అమరావతి ఛాంపియన్ షిప్’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు.. రాజధాని పేరును మరింత విస్తారంగా వినిపించేలా చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలను ఆదివారం ప్రారంభించారు. ప్రస్తుతం వీటిని తిరుపతిలో నిర్వహిస్తున్నారు.
తిరుపతిలో విశాలమైన ఎస్వీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వీ గ్రౌండ్స్‌లో అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలను మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ క్రీడా ప్రాథికార సంస్థ(శాప్) చైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. ఈ క్రీడలకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. అదేసమయంలో జాతీయ మీడియాను కూడా ఆహ్వానించారు. ఈ క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో విజయం దక్కించుకున్న క్రీడాకారులకు అమరావతి ఛాంపియన్ షిప్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందించనున్నారు.
వచ్చే ఏడు అమరావతిలోనే..
కాగా.. ప్రస్తుతం అమరావతి ఛాంపియన్ షిప్‌ను తిరుపతిలో నిర్వహిస్తున్నామని మంత్రి రాం ప్రసాద్ చెప్పారు. అమరావతిలో ప్రస్తుతం భారీ క్రీడా మైదానం ఏర్పాట్లు తొలిదశలో ఉన్నాయని.. అవి పూర్తయ్యేందుకు ఆరేడు మాసాలకు పైగానే సమయం పడుతుందన్నారు. ఈ క్రమంలో తిరుపతిని ఎంచుకున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాదికి అమరావతిలోనే ఈ క్రీడా పోటీలను ప్రారంభిస్తామని ఆయన వివరించారు. అమరావతిని ప్రమోట్ చేయడంలో భాగంగానే ఈ క్రీడలను ప్రారంభించినట్టు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates