ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సేనతో సేనాని’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్, మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా ఆదివారం విశాఖపట్నంలోని జనసేన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమమని ఆయన చెప్పారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొంటారని తెలిపారు.
30వ తేదీన విశాఖలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి నాదెండ్ల వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, ప్రజా ప్రతినిధుల పాత్ర, ప్రజలకు ఇప్పటి వరకు చేరువ అయిన వారి అనుభవాలను తెలుసుకుంటామని వివరించారు. ఈ మూడు రోజుల పాటు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని చెప్పారు. ఈ క్రమంలోనే పార్టీలో విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల గురించి కూడా సమీక్షించనున్నట్టు వివరించారు.
ఈ నెల 28న ఎమ్మల్యేలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారని నాదెండ్ల తెలిపారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పనితీరు, ప్రజలతో మమేకం అవుతున్న తీరును సమీక్షించనున్నట్టు వివరించారు. అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారం, ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం.. ప్రజల స్పందనను తెలుసు కుంటారని చెప్పారు. ముఖ్యంగా జనసేన పార్టీ మంత్రుల శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టనున్నట్టు వివరించారు.
29న ఎంపీలతో భేటీ అంటుందన్నారు. పార్లమెంటులో వ్యవహరిస్తున్న తీరు, పార్లమెంటు నియోజకవర్గా ల్లో జరుగుతున్న అభివృద్ధి, ఇతరత్రా పనులు సహా.. ఎంపీల పనితీరును కూడా అంచనా వేస్తారని నాదెం డ్ల పేర్కొన్నారు. దీని ప్రకారం భవిష్యత్తు కార్యాచరణను ఏర్పాటు చేసుకుంటామని వివరించారు. ఇక, 30న పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమం లక్ష్యం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమేనని పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates