తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాను గెలవడాన్నికొందరు ఇష్టపడలేదన్నారు. ఇప్పటికీవారి మనస్థత్వం అలానే ఉందన్నారు. పరోక్షంగా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి అందెశ్రీ ప్రచురించిన ‘హసిత భాష్పాలు’ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని శ్రీరామ్ రచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన గెలుపును కొందరు ఓర్చుకోలేదన్నారు. తనను ఓడించాలని శత విధాల ప్రయత్నించారని చెప్పారు. అయితే.. పాలమూరు బిడ్డలు తనను గెలిపించారని.. తనగెలుపును ఎవరూ ఆపలేకపోయారని అన్నారు. తాను ఎవరిని శత్రువుగా చూడనని, అలా చూడాలంటే వాళ్ళకి ఆ స్థాయి, అర్హత ఉండాలనే వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. తాను ముఖ్యమంత్రి అవుతానని కూడా అనుకోలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ వ్యవహారం కూడా తన ప్రత్యర్థులకు నచ్చలేదన్నారు. “ఒక రకంగా చెప్పాలంటే.. నా ప్రత్యర్థులకు.. గుండెలపై కుంపటిలా మారింది. నేను ముఖ్యమంత్రిగా సంతకం చేస్తే.. వారు తమ గుండెలపై గీటు పెట్టినట్టు అనిపించింది.“ అని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణపేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేస్తున్నామని సీఎం చెప్పారు. ఇదే అసలైన అభివృద్ధి అని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ తో పేదల ఆత్మగౌరవాన్ని పెంచామని.. ఇంతకంటే తెలంగాణ ప్రజలు కోరుకునే అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. అద్దాల బంగళాలు, ప్రాజెక్టులు కట్టి వాటి మాటున బొక్కే సంస్కృతికి అభివృద్ధి అని పేరు పెట్టుకున్న వారు ఇప్పుడు ఏమయ్యారో అందరికీ తెలిసిందేనని పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏళ్ల తర్వాత.. తాను ముఖ్యమంత్రి అయ్యానని.. ఇది తెలంగాణ ప్రజల ఆశీర్వాదంగా భావిస్తున్నట్టు చెప్పారు. నన్ను గెలిపించిన ప్రజలు.. నాపై పెద్ద బాధ్యత పెట్టారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన పదవిని, అధికారాన్ని కూడా ప్రజల కోసమే వినియోగించనున్నట్టు తెలిపారు. “నచ్చేవాళ్లు ఉంటారు. నచ్చని వాళ్లు ఉంటారు. కానీ, అధికారాన్ని వారి కోసం ఉపయోగించే తెలివిలేని వాడిని కాదు. ప్రజల కోసం మాత్రమే వినియోగిస్తా“ అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పేదల కోసమే పని చేస్తానన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కవులు, రచయితలు.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాన్ని ప్రశంసించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates