టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళల నుంచి ఆశీస్సులు దక్కుతున్నాయి. ఎంత ఎదిగిపోయావయ్యా.. అంటూ వందలాది మంది మహిళలు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా అమల్లోకి తీసుకువచ్చిన ‘స్త్రీ శక్తి’ పథకం.. ఏపీకి సంబంధించినంత వరకు చాలా కొత్తది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ ఈ పథకాన్ని ఏపీలో అమలు చేయలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పించా రు.
వాస్తవానికి ఈ పథకం అమలుపై ప్రభుత్వం అనేక సార్లు ఆలోచన చేసుకుంది. నెలకు ఎంత లేదన్నా.. 300 కోట్ల రూపాయలను వెచ్చించక తప్పదు. దీంతో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి.. ఈ పథకాన్ని అమలు చేసింది. దీనిపై వైసీపీ ఆది నుంచి కూడా విమర్శలు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయినా.. ఇంకా ఉచిత బస్సును ప్రారంభించలేదని.. మహిళలను మోసం చేస్తున్నారని.. జగన్ స్వయంగా అనేక సందర్భాల్లో ఆరోపించారు.
దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు వెరవకుండా స్త్రీ శక్తి పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పరిణామాలపై మహిళా లోకం.. ఆనందం వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు పట్ల కృతజ్ఞత చాటుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు.. చంద్రబాబు ఇంత చేస్తారని అనుకోలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. వృధ్ధులు అయితే.. చంద్రబాబు ఎంతో ఎదిగిపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా.. తమకు ఉచితబస్సు ఇచ్చారని.. యువతులు అంటున్నారు.
ఇక, ఇతర రాష్ట్రాల్లో అనేక మార్లు అధ్యయనం చేసిన చంద్రబాబు.. అక్కడ అమలవుతున్న దానికంటే కూడా.. మరిన్ని రెట్లు ఎక్కువగా ఇక్కడ అమలు కావాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే.. ఉచిత పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలిసారి జిల్లాలకే పరిమితం చేయాలని అనుకున్నా.. వైసీపీ విమర్శలతో దీనిని వెనక్కి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సులను అమలు చేస్తున్నారు. నిజానికి ఇతర పథకాలతో పోల్చుకుంటే.. ఆర్టీసీ కి అయ్యే వ్యయం తక్కువగానే ఉంది. ఉదాహరణకు వేరే పథకాన్ని అమలు చేయాలంటే.. ఒకేసారి 10 నుంచి 20 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు కానీ, ఆర్టీసీకి ఏటా 2 వేల కోట్లు ఇస్తే.. చాలు. దీంతోనే ఈ పథకాన్ని పట్టాలెక్కించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates